త్వరలో సరికొత్త క్రీడా విధానం

–  ప్రతిభను గుర్తించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం :మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌
–  ఈషాసింగ్‌, మొగిలయ్యకు ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్‌ పత్రాల అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్స హించేందుకు ప్రభుత్వం త్వరలో సరికొత్త క్రీడావిధానాన్ని తీసుకు రానుందని క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. రాష్ట్రావతరణ తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి భారీస్థాయిలో ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రముఖ షూటింగ్‌ క్రీడాకారిణి ఈషాసింగ్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఒక్కొక్కరికీ 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నజరానా ప్రకటించి వారిని సముచితంగా గౌరవిస్తున్నదని చెప్పారు. ఇంటిస్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహిస్తున్నదని వివరించారు. రాష్ట్ర యువతలో క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తున్నారని అన్నారు.