నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్‌

– మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు
– నిర్మాణానికి కేటాయించని నిధులు
–  చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఒక్క కేంద్ర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రకటించక పోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో నూతనంగా నిర్మించే మెడికల్‌ కాలేజీలకు కేంద్ర బడ్జెట్‌ లో ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్టెట్‌ ప్రజలను నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. కర్ణాటకలో ఎన్నికలప్పుడు వారు అడగకుండానే ‘అప్పర్‌ భద్ర డ్యాం’ కు జాతీయ హోదా ప్రకటించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కనీసం తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించడం లేదన్నారు. కనీసం ఈ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించక పోవడం చాలా బాధాకరమన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ (2023-24) చేవెళ్ల పార్లమెంట్‌ ప్రజలను, ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.