నేడు దేశవ్యాప్త ఆర్టీసీ నాయకుల సమావేశం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆర్టీసీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలు, కార్మిక సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు ఆదివారం (ఫిబ్రవరి 5) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దేశవ్యాప్త ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరగనుంది. దేశవ్యాప్త ఆర్టీసీలకు చెందిన దాదాపు 80 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతున్నట్టు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు తెలిపారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌), ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ సహా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ అనుబంధ ఆర్టీసీ సంఘాల నాయకులు పాల్గొంటు న్నారు. ముఖ్య అతిధులుగా ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షులు నేపాల్‌దేవ్‌ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య, ఎస్‌టీయూ సెక్టార్‌ కన్వీనర్‌ ఆర్ముగనాయనార్‌ హాజరవుతున్నారు. ఆర్టీసీల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశం కార్మికోద్యమ చరిత్రలో మైలురాయిగా నిలుస్తూ, భవిష్యత్‌ పోరాటాలకు దిశానిర్దేశం చేస్తుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు తెలిపారు.