పండితుల సస్పెన్షన్‌ను కొనసాగించడంలో మతలబేంటీ?

– వెంటనే ఎత్తేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముగ్గురు భాషాపండితులపై సస్పెన్షన్‌ను ఎత్తేయకుండా కొనసాగించడంలో మతలబేంటని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడైన పండిట్‌, పీఈటీ పోస్టుల్లో పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ ఆరేండ్లుగా ఒక తంతుగా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ క్రమంలో వారు విసుగు చెంది జాబ్‌ చార్ట్‌ ప్రకారం వారికి నిర్దేశించిన ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి బోధనకే పరమితమౌతామంటూ తొమ్మిది, పదో తరగతి బోధనను బహిష్కరించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల డీఈవోలు ముగ్గురు పండితులను సస్పెండ్‌ చేశారని వివరించారు. ఈ విషయం విద్యామంత్రి దృష్టికి రాగానే తమను సంప్రదించకుండా ఎలా సస్పెండ్‌ చేస్తారనీ, వెంటనే ఆ సస్పెన్షన్‌ను ఎత్తేయాలంటూ అధికారులను ఆదేశించినట్టు పత్రికల్లో వచ్చిందని తెలిపారు. కానీ నాలుగు రోజులైనా సస్పెన్షన్‌ను ఎత్తేయలేదని విమర్శించారు. ఇందులోని మర్మమేంటో, మతలబేంటో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘ బాధ్యులు డీఈవోలను సంప్రదిస్తే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి సందర్భాల్లో సస్పెన్షన్‌ చేయాలనేది సీసీఏ నిబంధనల్లో స్పష్టంగా ఉందని వివరించారు. ఈ సంఘటనలో సస్పెండ్‌ చేయాల్సిన అవసరం లేదనీ, దీనివల్ల ప్రయోజనం లేదని తెలిపారు. గత మూడేండ్లుగా పాఠశాల విద్యాశాఖ పనితీరు విధ్వంసకరంగా ఉందంటూ సీఎం, విద్యామంత్రి, కార్యదర్శికి గతంలో తెలియజేశానని వివరించారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సరిచేసుకోవాలని సూచించారు.