పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు

– ఐదేండ్లలో కనిష్టం.. పది శాతం తగ్గుదల : ఏఐఎస్‌హెచ్‌ఈ నివేదిక
– అధిక ఫీజులు.. తక్కువ ప్లేస్‌మెంట్‌లు కారణాలు : ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో అండర్‌గ్రాడ్యుయేట్ల (యూజీలు) లో ఇంజినీరింగ్‌ ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పది శాతం పడిపోయాయి. ఉన్నత విద్యపై ఆలిండియా సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2016-17లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలు మొత్తం 40.85 లక్షలుగా ఉన్నాయి. అయితే, అది 2020-21లో 36.63 లక్షలకు పడిపోవడం గమనార్హం. ఇక ఇతర విభాగాల మొత్తం అడ్మిషన్లు మాత్రం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. 2019-20 మరియు 2020-21లో లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలు 20 వేలు పెరుగుదలను నమోదు చేశాయి. అయితే, మొత్తానికి గత ఐదేండ్లలో ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు కనిష్టంగా నమోదయ్యాయి. అధిక ఫీజులు, కాలేజీలలో ప్లేస్‌మెంట్‌లు తక్కువ ఉండటం.. వంటి రెండు ప్రధాన కారణాలు ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశాలు తగ్గిపోవడానికి గల కారణాలుగా కొందరు ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు తెలిపారు.