మా తాత తరం సదువుకోలే
ఆ పాదాల స్పర్శ కోసం
పడిగాపులు కాసి కాసి
తన ముచ్చట తీర్చుకునే
మా అయ్య తరం కాసింత సదివినా
పాదాల మర్మము పసిగట్టినా
నిజం సెప్పే దమ్ము లేక వాటి
స్పర్శ కోసం పాకులాడుతుండే
సదువుకున్న ఇగురం ఈతరానికున్న
పాపపు పాదాల చెంతకు చేరకున్నా
రంగులు మార్చే పాదాల పోకడకు
పోటెత్తుతున్న మంద గుంపును చూసి
అవసరమో లేక అవకాశ బలహీనమో
ఈ తరాన్ని అయస్కాంతములా
ఆ పాదాల చెంతకు లాగుతాయెమో
నరనరాల్లో బానిస భావం నింపుకున్న
నేటి తరాన్ని కిందేసి తొక్కడానికి
ఆ పాదాలకు పట్టేది ఎంత సేపు ?
పాద స్పర్శ కు రాయి మనిషిగా
మారింది నాటి చరిత్ర అయితే
ఈ పాద స్పర్శ కై మనిషి రాయిగా
మిగలడం నేటి వాస్తవ చరిత్ర.
– దుర్గమ్ భైతి,
9959007914