పార్లమెంటు, అసెంబ్లీ బేరీజు వేయండి

– అసెంబ్లీలో అన్నింటికీ సమాధానం చెప్పాం
– పార్లమెంటులో కేంద్రం ముఖం చాటేసింది :
శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అర్థవంతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఒకే సమయంలో ప్రారంభమైన పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణను ప్రజలు బేరీజు వేయాలని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నామమాత్రంగా ఉన్నా, ఎక్కడా బుల్డోజ్‌ చేయకుండా, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పిందని తెలిపారు. అదే సమయంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణను కూడా గమనించాలన్నారు. అక్కడ ప్రతిపక్షాలు అడిగిన ప్రధాన సమస్యలపై ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా ముఖం చాటేశాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయనే ప్రశ్నకంటే, ఎంత హూందాగా, అర్థవంతంగా జరిగాయనే దానికే తాము ప్రాధాన్యమిస్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశాల నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని సీఎం కేసీఆర్‌ హుందాగా చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని తెలిపారు. పలు అంశాలపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయనీ, అనేక అంశాలపై ప్రభుత్వం సానుకూల సమాధానాలు చెప్పిందన్నారు.