– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభల్లో రూపకల్పన
– 29న భారీ బహిరంగ సభ… కేరళ సీఎం పినరరు విజయన్ రాక
– పోస్టర్ ఆవిష్కరణలో నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధమవుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య చెప్పారు. ఈనెల 29,30,31 తేదీల్లో ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహచనున్న మహాసభల్లో కూలీల సమస్యలతోపాటు ఉపాధిహామీ చట్టం, పోడు, అసైన్డ్‌భూములు, సీలింగ్, దేవాదాయ భూములను పేదలకు పంపిణీ చేయాలనే డిమాండ్లపై చర్చించి కార్యచరణను రూపొందిస్తామని చెప్పారు. పేదలకు పంపించేందుకు పదిన్నర లక్షల ఎకరాల భూమి రాష్ట్రంలో ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, కందుకూరి జగన్, ఆంజనేయులు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 29న బహిరంగ సభకు కేరళ సీఎం పినరరు విజరు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌తోపాటు సీనియర్ నాయకులు పాటూరి రామయ్య, సోమయ్య, రాష్ట్ర నాయకులు తదితరులు హాజరవుతారని తెలిపారు.
గుజరాత్ మోడల్ ఇదేనా?
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గుజరాత్ మోడల్‌లో రోజు కూలీకి రూ 216 ఇస్తున్నారని నాగయ్య విమర్శించారు. కేరళ రాష్ట్రంలో మాత్రం రూ 726 కూలీ చెల్లిస్తూ…దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేరళ ప్రభుత్వం కరోనా కాలంలో వలస కార్మికులకు వారికి కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆదుకున్నదని తెలిపారు. స్వరాష్ట్రానికి పోలేని పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు అన్‌లిమిటెడ్ రిచార్జీ చేసిందని గుర్తు చేశారు. 16 రకాల నిత్యవసర సరుకులకు అతి తక్కువ ధరకు సరఫరా చేసిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. అరకొర నిధులు కేటాయిస్తూ క్రమంగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.