పోలీసు జాగిలాలకు అంతర్జాతీయ శిక్షణ

–  నేడు ట్రైనింగ్‌ పూర్తి చేసుకోనున్న 38 జాగిలాలు,68 మంది హాండ్లర్స్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నేరస్థుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించే సుశిక్షతమైన పోలీసు జాగిలాలకు ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రెటెడ్‌ ట్రైనింగ్‌ అకాడమి (ఐఐటీఏ)లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ నిచ్చారు. దాదాపు 38 పోలీసు జాగిలాలతో పాటు వాటిని నిర్వహించే 68 మంది హాండ్లర్స్‌కు ఈ శిక్షణను ఇచ్చినట్టు అకాడమి అధికారులు తెలిపారు. ఎనిమిది నెలల పాటు కఠినమైన శిక్షణను ఇచ్చారనీ, దీంతో దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంఘవిద్రోహ శక్తులు, నేరస్థులు, ఉగ్రవాదులు పన్నె కుట్రలను పసిగట్టడంలో ఈ జాగిలాలు ఎంతగానో సుశిక్షితమైనాయని వారు చెప్పారు. ఇందులో లేబ్రా, డోబర్‌మెన్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, జర్మన్‌ షిఫర్డ్‌ వంటి మేలు జాతి శునకాలు ఉన్నాయని తెలిపారు. వీటికి నేరస్థలంలో నేరస్తులకు సంబంధించిన వాసనను పసిగట్టి వెంటాడటం మొదలుకుని ఉగ్రవాదులు దాచే బాంబులను పసిగట్టే శిక్షణను సంపూర్ణంగా ఇచ్చారని చెప్పారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు వీటికి దేహదారుఢ్యం మొదలుకుని ఇతర శిక్షణలను ఇచ్చారని ఇందులో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన శిక్షకులు ట్రైనింగ్‌ ఇచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన శునకాలే గాక హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన పోలీసు జాగిలాలు కూడా శిక్షణ పొందిన వాటిలో ఉన్నాయని వారు వివరించారు. గురువారం మోయినాబాద్‌లోని ఐఐటీఏ అకాడమిలో జరిగే పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు రాష్ట్ర హౌంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వారు చెప్పారు. పోలీసు జాగిలాలకు శిక్షణను జయప్రదంగా ముగించిన ఐఐటీఏ శిక్షకులకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ అభినందనలు తెలిపారు. ఈ జాగిలాలను అవసరమైన పోలీసు విభాగాలకు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.