ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలి

– వీధి కుక్కల దాడిపై ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు
– కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు లబ్ది
– హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో..: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-రేగొండ/చిట్యాల
రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో ఓటమి తప్పదని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని లక్ష్మీ నరసింహ స్వామిని బుధవారం ఉదయం సందర్శించి మొక్కలు చెల్లించారు. అనంతరం మండలం లోని చల్లగరిగా గ్రామం నుంచి హాత్‌ సే హాత్‌ యాత్రను ప్రారంభించారు. జూకల్‌, తిరుమలాపూర్‌, చిట్యాల, ఏలేటి రామాయపల్లె, నవాబుపేట మీదుగా పాదయాత్ర కొనసాగింది. రేగొండలో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్‌లో చేరి సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. హైదరాబాద్‌లో సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కనబడు తుందన్నారు. అంబర్‌పేటలో చిన్నారిని కుక్కలు కరవడంతో అక్కడి మేయర్‌ కుక్కలకు ఆకలేసిందని పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేద్దామనడం సిగ్గుచేటన్నారు. భూపాలపల్లి జిల్లా పర్యటనకు ముందే మంత్రి కేటీఆర్‌ అంబర్‌పేటలో కుక్కల దాడిలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఆయిల్‌ పామ్‌ కంపెనీ పరిశ్రమతో వందలాది ఎకరాలు ఎమ్మెల్యే బినామీలు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. నాడు నక్సలైట్లు జెండాలు పెట్టి పేదలకు పంచిపెట్టిన భూములు ఈరోజు భూస్వాముల పేరిట స్థానిక ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటే, దీనిపై విచారణకు అదేశించడానికి మంత్రి సిద్ధంగా ఉన్నరా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజల కోసం అనేక పోరా టాలు చేస్తున్న గండ్ర సత్యనారాయణ రావుకు ప్రజలు పట్టం కట్టాలని కోరారు. అనంతరం చిట్యాల మండల కేంద్రంలో బస చేసిన రేవంత్‌రెడ్డి.. బస ప్రాంగణంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలోనే పేద బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు అందాయని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని తెలిపారు. మహిళలు తలుచుకుంటే తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్‌ మాయ మాటలు చెప్పి అనేక హామీలిచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో బండ గ్యాస్‌ ధర రూ.400 ఉంటే నేడు రూ.1150కి పెంచారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ నిత్యవసర సరుకులు పెంచడమే కాకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే వాటిపై మేనిఫెస్టో వివరించారు. యాత్రలో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లు రవి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్‌రెడ్డి, ఘన్‌పూర్‌ జడ్పీటీసీ పద్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దొమ్మాటి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.