పరీక్షలు కాదు..ప్రభుత్వాన్నే రద్దు చేయాలి

– మంత్రి కేటీఆర్‌ పేషీ నుంచే లీకేజీ తతంగం : నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్‌
నవతెలంగాణ-గాంధారి
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీలతో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని, రద్దు చేయాల్సింది పరీక్షలను కాదని, ప్రభుత్వాన్ని అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ‘హత్‌ సే హత్‌’ జోడో పాదయాత్రలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్‌ అతి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ విషయంలో కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయడమే కాకుండా, చంచల్‌ గూడ జైలుకు పంపించాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్‌ చేసిన వారిని కస్టడీలోకి తీసుకొని, ఇప్పటి వరకు ఎందుకు వివరాలు సేకరించలేదని ప్రశ్నించారు. జైలులో ఉన్న నిందితులను బెదిరించి ఎన్‌కౌంటర్‌ చేస్తామని లొంగదీసుకున్నారని అన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు చంచల్‌ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ నిందితులు ఎవరో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరి చెప్పడం అనుమానాలు కలిగిస్తుందని అన్నారు. కస్టడీకి ముందే ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరే ప్రధాన నిందితులు, నేరానికి పాల్పడ్డారని కేటీఆర్‌ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఏమైనా విచారణ అధికారా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులు గ్రూప్‌ పరీక్షలు రాయడానికి అర్హత లేదు కానీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా ఎన్‌ఓసీ ఇవ్వడంతో పరీక్షలు రాశారని తెలిపారు. మాధురి అనే ఆవిడ అమెరికా నుంచి వచ్చి గ్రూప్‌-1 రాస్తే మొదటి ర్యాంక్‌ వచ్చిందని, టీఎస్పీఎస్సీలో జూనియర్‌ అసిస్టెంట్‌ రజినీకాంత్‌కి 4వ ర్యాంక్‌ వచ్చిందని, ఇందులో లీకేజీ ప్రధాన పాత్ర పోషించిందని ఆరోపించారు. లీకేజీలో కాన్ఫిడెన్సియల్‌ సెక్షన్‌ అధికారి శంకర్‌ లక్ష్మి పాత్ర పై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు, ఇప్పుడు ప్రశ్నపత్రాల కొనుగోలు జరిగిందని ఆరోపించారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వినిపిస్తామని, అలాగే 21వ తేదీన దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుదామని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేసినందుకు రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అంజనీకుమార్‌ యాదవ్‌, సుభాష్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love