ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కోచింగ్‌ల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.
ఆదివారం నారాయణగూడలో డీవైఎఫ్‌ఐ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో గ్రూప్‌ 1,2,3,4, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఇతర పోటీ పరీక్షల శిక్షణ పేరిట విపరీత దోపిడీ జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస నిబంధనలు పాటించకుండా, ఫైర్‌ సేఫ్టీ లేకుండా. ఇరుకు గదులు, ఫంక్షన్‌ హల్స్‌, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న తీరును వివరించారు. కనీసం తాగడానికి నీళ్లను కూడా అందుబాటులో ఉంచడం లేదనీ, టాయిలెట్స్‌ లేకుండా కోచింగ్‌ సెంటర్లు నడుపుతున్నారని తెలిపారు.
అలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, ఎమ్‌డి.జావీద్‌, జిల్లా నాయకులు రవి, శృతి, హస్మిబాబు,భానుప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.