– రాష్ట్రంలో భూ, ఇండ్లు, ఇండ్లస్థలాలు, కూలి పోరాటాలను ఉధృతం చేస్తాం : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) మహాసభలు జరుగబోతున్నాయనీ, 18న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన వ్యకాస రాష్ట్ర మహాసభలను జయప్రదం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మహాసభలో 31 తీర్మానాలు, ఆరు కమిషన్లను ఆమోదించామని తెలిపారు. రాష్ట్రంలో భూమి, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కూలి పెంపు కోసం పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నదనీ, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నామని తెలిపారు.
ఈ నెల ఎనిమిదో తేదీన ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన సదస్సులో వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య మాట్లాడుతూ..రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల జీవనప్రమాణాలు రోజురోజుకీ పడిపోతున్నాయనీ, మహిళాకూలీలు పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌బియ్యం ఇస్తాం..పింఛన్లు ఇస్తాం అని చెబితే సరిపోదనీ, వ్యవసాయ కూలీల జీవనవిధానం మెరుగుపడే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనం చేస్తామని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం సౌకర్యాలు అందించేలా, ఇండ్లు, ఇండ్లస్థలాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటాల దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ, రాష్ట్ర నాయకులు ఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు.