బాల్కొండ మండల ఎంఈఓ ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి

– డిటిఎఫ్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్  
అవినీతి, అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బాల్కొండ ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్కి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బాలయ్య రాజయ్య గురువారం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  మెండోరా మండలానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎంఈఓ బి. రాజేశ్వర్ నూతన ఎమ్మార్సీ భవన ప్రారంభోత్సవానికి ఖర్చులకు విరాళాలు సేకరణ పేరిట బాల్కొండ, ముప్కాల్,  మెండోరా మండలాలలో ఉపాధ్యాయుల దగ్గర నుండి వెయ్యి నుండి 5 వేల రూపాయల వరకు బలవంతంగా వసూలు చేయడం తాజాగా మండలంలో చర్చనీయాంశం అయ్యింది.
ఉపాధ్యాయులనే కాకుండా ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలు కోచింగ్ సెంటర్  యజమానులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించడం జరిగింది. అధికారికంగా ప్రారంభించబడే ఎమ్మార్సీ భవనానికి ప్రభుత్వమే కావలసిన నిధులు విడుదల చేస్తుంది. కానీ ప్రారంభోత్సవానికి నిధులు కావాలని విరాళాలు సేకరించడం అధికార దుర్వినియోగమే అవుతుంది. సదరు ఎంఈఓ అవకాశం  దొరికితే చాలు విరాళాలు సేకరించడం కాజేయడం ఉద్యోగ జీవితంలో సర్వసాదారణం . గతంలో 2020 సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలో కరోనా సందర్భంగా వలసదారులకు భోజనం, అంబలి ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా గుర్తించి విరాళాలు సేకరిoచి సదరు ఎంఈఓ దగ్గర నిధులను ఉంచితే అట్టి నిధులకు లెక్కలు ఇవ్వకుండా కాజేసిన వైనం ఉపాధ్యాయులందరికీ తెలుసు.
గతంలో ముప్కాల్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన కాలంలో పాఠశాల స్వర్ణోత్సవాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి లెక్కలు చూపకుండా కాజేసిన విషయమై గ్రామ యువత నిలదీసిన సందర్భాoతో పాటు ఫేక్ బిల్లులతో పాఠశాల గ్రాంట్ల దుర్వినియోగం ఆరోపణలు సదరు ఎంఈఓ ఎదుర్కొన్నాడు. పాఠశాల నిధులపై విచారణలో అక్రమాలు బయటపడతాయి. ప్రస్తుతo పని చేస్తున్న చిట్టాపూర్ ఉన్నత పాఠశాలలో కూడా ఫేక్ బిల్లులతో నిధులు కాజే సిన వైనం విచారిస్తే గుర్తించవచ్చు. 2017 సంవత్సరంలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ సంబంధించి మంజూరైన టీఏ డీఏలను కాజేయడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బాల్కొండ ప్రైమరీ స్కూల్ కు చెందిన ఉపాధ్యాయుడు 20 రోజుల సెలవు కోరుతూ ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మాయం చేసి సదురు ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా విధులకు గైర్హజర్ అయినట్టు విద్యాశాఖకు తప్పుడు నివేదిక పంపి ఉపాధ్యాయుని సస్పెన్షన్కు కారణమైనాడు.
సెలవు మ oజూరికి అడిగిన డబ్బులు ఇవ్వలేదని, పైగా సెల్ ఫోన్ సంభాషణను  వాట్సాప్ లో వైరల్ చేశాడని కోపంతో తప్పుడు నివేదికలతో సదరు ఉపాధ్యాయున్ని విధులలోనికి తీసుకోకుండా  ఎంఈఓ అడ్డుపడ్డాడు. ఫలితంగా పది నెలలకు పైగా సస్పెన్షన్ లో  ఉపాధ్యాయుడు ఉన్నాడు. జిల్లాలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు కూడా సస్పెన్షన్ అయిన నెలలోపు విధులలోకి తీసుకోబడ్డారు. కేవలం గైర్హాజరు, కారణంపై పది నెలలకు పైగా సస్పెన్షన్ కొనసాగించడం పైగా ఆరు నెలల తర్వాత సస్పెన్షన్ ఉద్యోగికి చెల్లించబడే 3/4 సబ్సిస్టెంట్ అలవెన్స్ను ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖ ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయుడు తీవ్ర మానసిక, ఆర్థిక సమస్యకు లోనై కుటుంబం సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. విధులకు గైర్హాజరైన ఉద్యోగి విధులలో చేర్చుకోమ్మని ఇచ్చే విజ్ఞాపన పత్రం ఆధారంగా విధులలోనికి తీసుకునుటకు ప్రభుత్వ ఉత్తర్వుల మెమో నంబర్.9101-4/8/FRI/91 తేదీ 25/12/1991 ని జిల్లా విద్యాశాఖ విస్మరించడం విచారకరం. డిప్యూటేషన్ల విషయానికి వస్తే, వర్క్ అడ్జస్ట్మెంట్ కింద పెట్టే అన్ని రకాల డిప్యూటేషన్లు ఏనాడు నిబంధనలకులోబడి  సదరు ఎంఈఓ పెట్టలేదు. అనేక డిప్యూటేషన్లలో అక్రమాలు విచారణలో బయటపడగలవు. పాఠశాల ప్రార్థనకు హాజరుకాని ఉపాధ్యాయుల వివరాలు సేకరించి డబ్బులు డిమాండ్ చేయడం లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారి కి ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిల్ చేయడం ఆయనకు పరిపాటుగా మారింది. కావున జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించి అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాల్కొండ ఎంఈఓ రాజేశ్వర్ ను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపి తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలియజేశారు.