బీజేపీలోకి వద్దన్నా…

– వామపక్ష భావాలెక్కువున్న జిల్లాలో నెగ్గుకురాలేం
– పొలిటికల్‌ కేరీర్‌ ఆగమయ్యేలా గ్రౌండ్‌ రియాలిటీ
– పొంగులేటికి సన్నిహితుల సూచన
– క్షేత్రస్థాయి రిపోర్టులతో మాజీ ఎంపీ వెనక్కి
– కాంగ్రెస్‌లోకా? వైఎస్‌ఆర్‌టీపీలోకా? తేల్చుకోలేకపోతున్న వైనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘కమ్యూనిస్టుల గుమ్మం ఖమ్మం. బలమైన వామపక్ష భావాలకు నిలయం. ఎవరినైనా ఓడించే సత్తా అక్కడ ఎర్రజెండాకున్నది. ఇలాంటిచోట పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలోకి పోవద్దు. పోతే పొలిటికల్‌ కేరీరే ఆగమవుతుంది’ ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే రాజకీయ చర్చ. ఆయన ఆ పార్టీలోకి వెళ్తే అనుచరులూ వెన్నంటే నడిచేందుకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే తాను అనుకున్న దానికి భిన్నంగా గ్రౌండ్‌ రియాల్టీ ఉన్న క్రమంలో బీజేపీలోకి వెళ్లొద్దనే నిర్ణయానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడాక ఆయన హడావిడిగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఖమ్మంలో గెలవకపోయినా రాజ్యసభ సీటు ఇస్తామంటూ ఆపార్టీ ఆయనకు ఆఫర్‌ ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఆ పార్టీ అధిష్టానానికి హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లగా ప్రజల నుంచి అంత పాజిటివ్‌ రాలేదు. ఖమ్మంలో తనకున్న సంబంధాలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారనే సానుభూతి పొందిన ఆయన బీజేపీలోకి పోతే ఆ పరిస్థితి ఉండబోదనే సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో ఆయన్ను నమ్ముకున్న అనుచరుల్లో, శ్రేణుల్లో దళితులు, వెనుకబడిన సామాజిక తరగతుల వారే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే ఆయన వెంట నడిచేందుకు వారంతా సిద్ధం లేరనే విషయంపైనా ఆయన ఒక అవగాహనకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినా ఆదరణ దక్కుతుందిగానీ..పువ్వుగుర్తుపై ఆయన పోటీచేస్తే కనీసం డిపాజిట్‌ కూడా దక్కదనే చర్చ ఆ జిల్లాలో జోరుగా సాగుతున్నది. అందుకే ఆయన వామ్మో బీజేపీనా? క్షేత్రస్థాయిలో ప్రజలు రివర్సయితే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారబోతుందనే ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన తన సోదరుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అక్కడ అంత గౌరవమూ, ప్రాధాన్యతా దక్కట్లేదన్నదని సుస్పష్టం. ఇదే విషయంపై సుధాకర్‌రెడ్డి పలు సందర్భాలలో వేదికలపైనే ఒకింత అసహనానికి గురయిన విషయం బహిరంగ రహస్యమే. ఆలూ లేదు..సూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా…తెలంగాణలో పట్టులేని బీజేపీలో ఇప్పుడు మూడుముక్కలాట మాదిరిగా మూడు గుంపులపోరు నడుస్తున్నది. బండి, ఈటల గ్రూపులకు అస్సలే పడట్లేదు. ఈ విషయం కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలోనే బండి సంజరు, ఈటల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. వేములవాడ టికెట్‌ విషయంలో కోల్డ్‌ వార్‌ నడుస్తున్నది. అంతర్గత కుమ్ములాటలతో విసిగివేసారిన ఈటల…రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరి తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అంత సులువుకాదనే విషయాన్ని కొంత మంది ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇలాంటి పరిణామాలలో బీజేపీలో చేరి ఉన్న పలుకుబడిని, రాజకీయ కేరీర్‌ను నాశనం చేసుకోవద్దనే ఆలోచనలో ఈ మాజీ ఎంపీ పడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మిగతా ఏ పార్టీలోకెళ్లినా ప్రజలు ఆశ్వీదిస్తారుగానీ బీజేపీలో చేరితే తనను దగ్గరకు తీయబోరనే భావనకు ఆయన వచ్చారు. అయితే, పొంగులేటి తమ పార్టీలో చేరకున్నా సరే కాంగ్రెస్‌లోకి వెళ్లనీయవద్దనే ఎత్తుగడతో బీజేపీ పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అనంతరమే పొంగులేటి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిలతో భేటీ కావడం దీనికి బలం చేకూరుస్తున్నది. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే సంకేతాలు ఆయనకు అందాయి. అయితే వైఎస్‌ఆర్‌టీపీలో చేరి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆయన ఆలోచిస్తున్నట్టు అయితే, దీన్ని ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచిచూడాలి. బీఆర్‌ఎస్‌ కాదని బయటికొచ్చాక ఇటు బీజేపీలోకి వెళ్లలేక..పట్టులేని వైఎస్‌ఆర్‌టీపీలో చేరి నెగ్గుకొస్తామన్న భరోసా లేకపోవడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైంది. ఈ పరిణామాలను గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా రంగంలోకి దింగింది. ఆయనతో భట్టి, రేవంత్‌రెడ్డి, ఇతర అగ్ర నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారు ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ కోరుతున్నట్టు సమాచారం.