బీబీసీ డాక్యుమెంటరీ నిషేధించాలా?

– పిటిషన్‌దారుపై సుప్రీం ఆగ్రహం
– సరైన అవగాహన లేదంటూ తిరస్కరణ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా భారతదేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సరైన అవగాహన లేకుండా పిటిషన్‌దాఖలు చేశారంటూ పిటిషన్‌దారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా తప్పుడు అవగాహనతో పిటిషన్‌ వేశారని పేర్కొంది. డాక్యుమెంటరీని నిషేధిం చాలంటూ హిందు సేన చీఫ్‌ విష్ణు గుప్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారతదేశ వ్యతిరేక వైఖరిని డాక్యు మెంటరీలో చూపారంటూ ఆయన ఆరోపించారు. అంతర్జాతీ యంగా ఎదుగుతున్న భారతదేశానికి, మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఫలితమే ఈ డాక్యుమెంటరీ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, భారత్‌ ఎదుగుదలను భారతదేశ వ్యతిరేక లాబీ, మీడియా, బీబీసీ జీర్ణించు కోలేకపోతున్నాయని అన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించటం లేదని తెలిపింది. పూర్తి గా తప్పుడు అవగాహనతో కూడుకున్న పిటిషన్‌గా ధర్మాసనం అభిప్రాయ పడింది. ”ఈ వాదన ఎలా సాధ్యమవుతుంది? మీరు పూర్తి సెన్సార్‌షిప్‌ విధించాలని కోరుతున్నారా? ఏమిటిది?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పాత్రికేయుడు ఎన్‌.రామ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం విచారణ జరిపింది.డాక్యుమెంటరీకి సంబం ధించిన లింక్స్‌తో కూడిన ట్వీట్లను తొలగించాలని ఎందుకు నిర్ణయిం చారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా వివరాల ను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసింది.