భాషా పండితుల సస్పెన్షన్‌ ఎత్తేయాలి

–  టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదోన్నతులు దక్కటం లేదనే ఆవేదనతో నిరసన తెలుపుతున్న భాషాపండితులను సస్పెండ్‌ చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. వారిపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏండ్ల తరబడి పదోన్నతి లేకపోయినా, పాఠశాలల్లో వివక్షకు గురౌతున్నా విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులివ్వకుండా మభ్యపెడుతున్నారంటూ వారు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌లో కూడా వారి పదోన్నతుల అంశం లేకపోవడంతో భాషాపండితులు ఆవేదనకు గురయ్యారని వివరించారు. దీంతో వారి జాబ్‌ చార్ట్‌లో లేని విధంగా ఉన్నత పాఠశాలల్లో బోధన చేయబోమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయినా వారు అనధికారికంగా పాఠాలు బోధిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. నిరసన లేఖల ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి విద్యాధికారులు భాషా పండితులపై సస్పెన్షన్‌ వేటు వేయడం అన్యాయమని విమర్శించారు. డీఈఓల చర్యను తీవ్రంగా ఖండిస్తున ా్నమని తెలిపారు. భాషాపండితులపై వేసిన సస్పెన్షన్‌ వేటు వెంటనే ఎత్తేయాలనీ, పదోన్నతులపై ఉన్న కేసును ప్రభుత్వం చొరవతీసుకుని తొలగించాలనీ కోరారు. ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్‌లోనే పండితులకు సైతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ఖండన
భాషాపండితులను సస్పెండ్‌ చేస్తూ డీఈవోలు ఆదేశాలు ఇవ్వడాన్ని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు జి సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడాన్ని బీసీటీఏ అధ్యక్షులు కె కృష్ణుడు, కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్‌ ఖండించారు. అందరితోపాటు పండితులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు.