మండలికే వన్నెతేవాలి : సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్‌ను సీఎం కేసీఆర్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చీఫ్‌ విప్‌ టి భానుప్రసాదరావు, కాంగ్రెస్‌ సభ్యుడు టి జీవన్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు అఫెండీ, స్వతంత్ర సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి తోడ్కొని వెళ్లి చైర్మెన్‌ స్థానంలో కూర్చొబెట్టారు. వారందరూ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రకాశ్‌ శాసనమండలికే వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఆయన సామాన్య కుటుంబంలో జన్మించినా పీహెచ్‌డీ వరకు చదివి పేరుప్రఖ్యాతులు సంపాదించారని చెప్పారు. అతి తక్కువ వయస్సులో వరంగల్‌ మున్సిపాల్టీలో కౌన్సిలర్‌గా గెలిచి డిపూటీ చైర్మెన్‌ అయ్యారని గుర్తు చేశారు. ముదిరాజ్‌ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని అన్నారు. కోకాపేటలో ముదిరాజ్‌ భవన నిర్మాణం కోసం ఎంపీగా ఉన్నపుడు రూ.కోటి సహాయం చేశారని వివరించారు. బండ ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నపుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సేవలు అవసరమని భావించి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చామని చెప్పారు. డిప్యూటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టడం అందరికీ గర్వకారణమని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణ రాకపోయినా ఇప్పుడు ఆ కల సాకారం చేసుకుని మండలికి డిప్యూటీ చైర్మెన్‌ కావడం సంతోషకరమని చెప్పారు. అన్ని వర్గాల బిడ్డలకూ అవకాశాలు దక్కుతాయనడానికి ఆయనే ఉదాహరణ అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సభ్యులందరి మన్ననలు పొందాలనీ, రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల మేరకు సభను నడిపించాలని సూచించారు. ఆయన జీవితంలో పూర్తి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రతిపక్షాలకూ అవకాశమివ్వాలి : కేటీఆర్‌
డిప్యూటీ చైర్మెన్‌ హోదాలో బండా ప్రకాశ్‌ సభలో అధికార పార్టీతోపాటూ ప్రతిపక్షాలకూ అవకాశమివ్వాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సద్విమర్శలతో సభను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ బండ ప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మండలి సమావేశాల నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. కీర్తిని పెంచాలనీ, అర్థవంతంగా చర్చలు జరపాలని సూచించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ భానుప్రసాదరావు, విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, కవిత, వాణీదేవి, గంగాధర్‌గౌడ్‌, తాత మధు, ఫారూఖ్‌ హుస్సేన్‌, బస్వరాజు సారయ్య, స్వతంత్ర సభ్యులు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, ఎంఐఎం సభ్యుడు అఫెండీ ప్రసంగించారు. ప్రకాశ్‌ సభా గౌరవాన్ని ఇనుమడింపచేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. సంఖ్య లేకున్నా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాలని సూచించారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ బండ ప్రకాశ్‌ సౌమ్యత, విషయ పరిజ్ఞానం అందరినీ అబ్బురపరిచిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు అనుమడింపజేసేలా సభలో చర్చలుండాలని సూచించారు.
నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా : బండ ప్రకాశ్‌
మండలి డిప్యూటీ చైర్మెన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, సహకరించిన మంత్రులు, చైర్మెన్‌, సభ్యులకు బండ ప్రకాశ్‌ ధన్యవాదాలు చెప్పారు. విశిష్ట అనుభవం ఉన్నవారు, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఇక్కడ సభ్యులుగా ఉన్నారని అన్నారు. సభా గౌరవాన్ని పెంపొందిస్తానని చెప్పారు. ఏ లక్ష్యం కోసం తనను ఈ స్థానంలో కూర్చోబెట్టారో, ఆ నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. సభ ఔన్నత్యాన్ని కాపాడతానని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానన్నారు. మండలికి మంచి పేరు తెస్తాననీ, ప్రజలకు ఉపయోగపడేలా అందరి కృషి ఉండాలని కోరారు. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తున్నదనీ, అందుకనుగుణంగా చర్చలుండాలని ఆకాంక్షించారు. అంతకుముందు మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బండ ప్రకాశ్‌ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మండలి చీఫ్‌విప్‌గా టి భానుప్రసాదరావు, విప్‌లుగా శంభీపూర్‌ రాజు, పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.