మచ్చిక..!

ఓ నాలుగు మిగిలిన
మెతుకులను విదిల్చి..
ఇక నీ ప్రపంచమంతా
నా చెంతేనని శాసించడమే మచ్చిక..!
ఆదిమ మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి
పుట్టుకొచ్చిన వ్యూహత్మక కుట్రే అది..!

బొచ్చుకుక్కకి అంగీ తొడిగి
సంబురపడుతున్నాడు
ఆహా.. ఎంతటి దయార్థ్ర హృదయుడో
నరనరానా జీవకారుణ్యం
అనుకుంటాం… కానీ,
ఆ మచ్చిక వెనుక ప్రయోజనం
ఎవరికి తెలియదని
షాంపూలు వ్యాక్సిన్లు బొమ్మ బొమికెలు
అతని పరిరక్షణ కోసమే..!

కాలకృత్యాలు కాలెత్తడాలు
కనురెప్ప కదిలకలు
దాని ఇచ్చానుసారమనుకునేరు
వాడి ఆదేశానుగుణంగానే
ముందస్తు శిక్షణే కాదు
మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే..!
అరచి ఘీ పెట్టి గింజుకున్నా…
గొలుసుకట్టు దాటి ఆవలిగట్టు
బంధు వర్గాన్ని ముట్టరాదు..!

గీసిన గిరి దాటి
అర ఇంచు స్వేచ్ఛ ఉండదు..!
ఒక్కసారి…
గొర్రెల మందలోనో, బర్రెల గుంపుతోనో
కలిసి జీవిస్తున్నట్టు
నిన్ను నువ్వు ఊహించుకో తేలిపోతుంది..!

నాకో సందిగ్ధం
మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా,
మనం తప్ప వాటికి గతి లేదా
ఆలోచించండి..!?
విడ్డూరమంటే ఇదే
సాటి మనిషిని చీదరించుకుని
వీటిని ఆదరించడం వెనక ఆంతర్యం
ఎవరికి తెలియనిది.. ముమ్మాటికది
ముదిరిన స్వార్త చింతనే..!
-నాంపల్లి సుజాత,
9848059893