మట్టిలో కలిపేస్తా…

–   అఖిలేష్‌నుద్దేశించి యూపీ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో : ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అఖిలేష్‌వైపు వేలు చూపుతూ.. ‘మట్టిలో కలిపేస్తాం’ అని యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఎస్పీ నేత హత్య కేసులో నింది తులను శుక్రవారం కాల్చిచంపడంపై.. ప్రతిపక్షాల విమర్శలకుగానూ అసెంబ్లీ వేదికగా శనివారం ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అసెంబ్లీలో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్‌ పాల్‌, అతడి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిని శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. దీనిపై విమర్శలు చేస్తున్న తరుణంలో… అఖిలేష్‌ యాదవ్‌వైపు యోగి వేలు చూపుతూ.. ‘బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్‌ అహ్మద్‌, సమాజ్‌ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగం కాదా?’ ఆ మాఫియా వెన్ను విరిచేందుకే మేం కృషి చేస్తున్నాం అన్నారు. మాఫియా గురించి ఆయన మాట్లాడుతూ.. ‘స్పీకర్‌ సార్‌, అన్ని ప్రొఫెషనల్‌ క్రిమినల్స్‌, మాఫియాకు గాడ్‌ ఫాదర్‌ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. కాగా, సీఎం యోగి వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సభలో మాట్లాడుతూ.. ‘నేరస్తులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అఖిలేశ్‌ ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్‌ ఇంజన్‌లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు. మరోవైపు సీఎం యోగి మళ్లీ ఘాటుగా స్పందించారు. అతిక్‌ అహ్మద్‌ మాఫియాను పెంచి పోషించింది, రక్షించేది సమాజ్‌వాదీ పార్టీ అని విమర్శించారు. వారు ఇప్పుడు మాపై వేలు చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దోషులను వదిలి పెట్టబోమని ఆయన అన్నారు. మాఫియా, నేరాలపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్‌ పాలసీ’ని అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌ విషయంలో కూడా ప్రభుత్వం దీని ప్రకారం వ్యవహరిస్తుందని అన్నారు. ‘బీఎస్పీ ఎమ్మెల్యే హత్యా ఘటనలో పాల్గొన్న వారిని సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించలేదా? సమాజ్‌వాదీ పార్టీ ఆయనను (అతిక్‌ అహ్మద్‌) ఎంపీ చేసింది’ అని ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ఈ సందర్భంగా ‘నువ్వు సిగ్గుపడాలి, నీ తండ్రిని కూడా నువ్వు గౌరవించలేదు’ అని అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి సీఎం యోగి అన్నారు. దీంతో సభలో మరోసారి గందళగోళం చెలరేగింది.