మరోసారి వాహనదారులపై భారం?

–  టోల్‌ ఛార్జీలు పెరిగే అవకాశం
–  ఏప్రిల్‌ 1 నుంచి వడ్డన
–  5శాతం నుంచి 10శాతం మేర పెంచే ఛాన్స్‌
న్యూఢిల్లీ : దేశంలోని వాహనదారులపై మోడీ సర్కారు మరోసారి భారం మోపడానికి సిద్ధమవుతున్నది. టోల్‌ ఛార్జీలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై టోల్‌ భారం పడనున్నది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీలను 5 శాతం నుంచి 10శాతం మేర పెంచేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదీ టోల్‌ రేట్లను సవరిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలైన టోల్‌ రుసుముల అధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. టోల్‌ వసూళ్ల విషయంలో మార్పులు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపుతుంది.