మాస్టర్‌ అజిత్‌కు బంగారు పతకం

–   డ్రాగన్‌ అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీలో చక్కటి ప్రదర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కరాటే, కుంగ్‌ఫూ అంతర్జాతీయ పోటీలలో మాస్టర్స్‌ విభాగంలో నగరానికి చెందిన మాస్టర్‌ అజిత్‌ బంగారు పతకాన్ని గెలుపొందారు. న్యూ డ్రాగన్‌ ఫైటర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ మయన్మార్‌ తదితర దేశాలకు చెందిన వారు ఈ పోటీలలో పాల్గొన్నారు. మరికొందరు క్రీడాకారులు ఆన్‌లైన్‌లో తమ కరాటే, కుంగ్‌ఫూ విద్యలను ప్రదర్శించారు. ట్రైనర్స్‌, మాస్టర్స్‌ విభాగంలోని 90 కిలోల విభాగంలో సావోలిన్‌ నింజా కుంగ్‌ఫూ ఇండియా అసోసియేషన్‌కు చెందిన సీనియర్‌ మాస్టర్‌ డాక్టర్‌ జి.అజిత్‌ కుంగ్‌ఫూ లో టైగర్‌ ఫామ్‌లో తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈయన జరిపిన విన్యాసాల స్థాయిలో ఇతర మాస్టర్లు ప్రదర్శన చేయక పోవడంతో మాస్టర్‌ అజిత్‌కు బంగారు పతకం వరించింది. కరాటే , మార్షల్‌ ఆర్ట్స్‌ లో దాదాపు ముప్పై ఏండ్లుగా శిక్షణనిస్తూ అనేక మంది విద్యార్థులను తయారు చేసిన అజిత్‌ తాను స్వయంగా గతంలో పాల్గొన్న జాతీయ, అంతర్జాతయ పోటీలలో పలు బంగారు పతకాలను గెలుపొందారు. ఈ పోటీలను నిర్వహించిన డ్రాగన్‌ ఫైటర్స్‌ అసోసియేషన్‌ సంస్థాపకుడు పీవీ శ్రీరాములు మాట్లాడుతూ.. దేశంలో యువతను మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రోత్సహించడం ద్వారా వారిలో మానసిక స్థైర్యం, పట్టుదల, దీక్షలను పెంచడానికి వీలవుతుందని తెలిపారు.