ముగిసిన టెన్నిస్‌ టోర్నమెంట్‌

– నంద్యాల, మెహర్‌ ప్రకాశ్‌, అనిరుధ్‌లకు టైటిల్స్‌
హైదరాబాద్‌: నాలుగు రోజుల పాటు హోరాహరీగా సాగిన 13వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సోమవారం ఘనంగా ముగిసింది. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పోటీల్లో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌ జోడీ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో చాంపియన్లుగా నిలిచారు. పురుషుల 50 ప్లస్‌ డబుల్స్‌లో నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌ టైటిల్‌ పోరులో కెవిఎన్‌ మూర్తి, సురేశ్‌లపై 10-8తో ఘన విజయం సాధించారు. మెన్స్‌ 30 ప్లస్‌ డబుల్స్‌లో అనిరుధ్‌, సిద్దార్థ జోడీ 10-5తో విజరు ఆనంద్‌, ఆఫ్రోజ్‌పై గెలుపొందారు. 40 ప్లస్‌ డబుల్స్‌లో వినోద్‌, కిరణ్‌లు.. 60 ప్లస్‌ డబుల్స్‌లో మెహర్‌ ప్రకాశ్‌, పాల్‌ మనోహర్‌లు.. 70 ప్లస్‌ డబుల్స్‌లో మదన్‌మోహన్‌, రాంబాబులు విజేతలుగా నిలిచారు. ఇక సింగిల్స్‌ విభాగంలో రామ్మోహన్‌ రావు (70 ప్లస్‌), మెహర్‌ ప్రకాశ్‌ (60 ప్లస్‌), నీల్‌కాంత్‌ (50 ప్లస్‌), వినోద్‌ శ్రీధర్‌ (40 ప్లస్‌), అంకిత్‌ భార్గవ (30 ప్లస్‌) టైటిళ్లు ఖాతాలో వేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన మహిళల ఓపెన్‌ సింగిల్స్‌లో సౌమ్య నాయుడుపై 10-0తో జానకి గెలుపొందగా.. మహిళల డబుల్స్‌లో ఉన్నతి, జానకి జోడీ 10-0తో సింధూర, అలేఖ్యలపై విజయం సాధించారు. జెహెచ్‌ఐసీ ఉపాధ్యక్షురాలు ఆదాల బిందుతో కలిసి కోల రాజ్యలక్ష్మీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.