రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ కారు ఢీకొని వ్యక్తి మృతి

–  మేడ్చల్‌ మున్సిపాల్టీ పరిధిలోని అత్వెల్లి వద్ద ఘటన
నవతెలంగాణ- మేడ్చల్‌
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్వెల్లి వద్ద జరిగింది. మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహా(58) మంగళ వారం ఉదయం తన టీవీఎస్‌ ఎక్సెల్‌ ద్విచక్ర వాహనంపై డబిల్‌పూర్‌ గ్రామం వైపు 44వ జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్‌ మున్సిపాల్టీ పరిధి అత్వెల్లి వద్దకు చేరుకోగా అదే సమయంలో రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వంటేరు ప్రతాపరెడ్డి కారు నర్సింహా ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మేడ్చల్‌ ఎస్‌ఐ శంకర్‌ గౌడ్‌ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. డ్రైవర్‌ చంద్రాపురం శేఖర్‌పై కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే, ప్రమాద సమయంలో కారులోనే ఉన్న వంటేరు ప్రతాప్‌ రెడ్డి వాహనం నుంచి దిగి కాసేపు ఘటన స్థలంలోనే ఉన్నారు. అనంతరం మరో వాహనంలో వెళ్లిపోయారు. మృతుడి కుటుంబీకులు మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరగా.. వంటేరు ప్రతాప్‌ రెడ్డి అను చరులు వారితో మాట్లాడి రూ.6 లక్షలు అందజేస్తా మని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.