రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి

–  సెన్సెక్స్‌ 928 పాయింట్లు ఫట్‌
– బేరుమన్న మదుపర్లు
– అథమ స్థాయికి అదానీ స్టాక్స్‌
ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయ ప్రతికూలాంశాలకు తోడు ఆర్థిక కార్యకలాపాల్లో అనిశ్చిత్తి, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, రూపాయి విలువ పతనం తదితర అంశాలు వరుసగా నాలుగు రోజూ సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. బుధవారం ప్రారంభం నుంచి తుది వరకు సూచీలు ఒత్తిడిలోనే కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1000 పాయింట్ల మేర క్షీణించి.. 60వేల మార్క్‌ దిగువకు చేరడంతో.. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తుదకు 928 పాయింట్లు లేదా 1.53 శాతం పతనమై 59,745కు జారింది. ఇదే బాటలో నిఫ్టీ 274 పాయింట్ల నష్టంతో 17,553 వద్ద ముగిసింది. అన్ని రంగాలు నేల చూపులు చూశాయి. లోహ సూచీ అత్యధికంగా 2.5 శాతం నష్టపోయింది. ఒక్క పూటలోనే మదుపర్లు రూ.3.9 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. గడిచిన నాలుగు సెషన్లలో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7 లక్షల కోట్ల మేర పతనమై రూ.261.3 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
ప్రధాన కారణాలు..
ముఖ్యంగా ఉక్రెయిన్‌ అంశంలో అమెరికా- రష్యా మధ్య మళ్లీ మదురుతున్న ఆవేశాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. అమెరికా మార్కెట్లు 2023లో అతిపెద్ద ఒక రోజు నష్టాన్ని మంగళవారం చవి చూశాయి. ఈ ప్రభావం భారత మార్కెట్‌లు సహా ఆసియా- పసిఫిక్‌, ఐరోపా మార్కెట్లపై పడింది. ఫిబ్రవరిలో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశానికి సంబంధించిన మినెట్స్‌ను ఇటు ఆర్బీఐ, అటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విడుదల చేయనున్నాయి. ఈ క్రమంలో అధిక ధరలపై ఆయా రెగ్యులేటరీ సంస్థల వైఖరి ఎలా ఉండనున్నదనే అంచనాలు సూచీలను ఒత్తిడికి గురి చేశాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ఏడాది జనవరిలో భారత్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 6.5 శాతం పైన నమోదయిన విషయం తెలిసిందే. దీంతో వడ్డీ రేట్ల పెంపు కొనసాగొచ్చనే అంచనాలు పలు స్టాక్స్‌పై ఒత్తిడిని పెంచాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుదల అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఉదయం సెషన్‌ ప్రారంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు కోల్పోయి 82.83 కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్‌ అయ్యింది.
నిండా మునుగుతున్న అదానీ స్టాక్స్‌
అదానీ స్టాక్స్‌ కోలుకోలేని విధంగా నిండామునుగుతోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న అదానీ గ్రూపు షేర్లపై మార్కెట్ల భారీ పతనం మరింత ఒత్తిడిని పెంచింది. అదానీ గ్రూపు తమకు అనుకూల వ్యాసాలను రాయించుకుందన్న వికీపీడియా విమర్శలు అదానీ సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తేలా చేశాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ విల్మర్‌ షేర్లు 5 శాతం మేర నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. గౌతం అదానీ కీలక కంపెనీ అయినా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ బీఎస్‌ఈలో ఏకంగా 10.43 శాతం లేదా రూ.163.55 పతనమై రూ.1,404.85కు పడిపోయింది. ఉదయం రూ.1,539 వద్ద ప్రారంభమైన ఈ సూచీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని.. ఇంట్రాడేలో ఏకంగా రూ.1,381 కనిష్ట స్థాయికి జారింది. నెల రోజుల్లో అదాని స్టాక్స్‌ 60 శాతం మేర పతనం కావడంతో గౌతం అదానీ సంపద రూ.12 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.