రెస్ట్‌దే ఇరానీ కప్‌

గ్వాలియర్‌ : యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (213, 144) 357 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు నమోదు చేయటంతో ఇరానీ కప్‌ రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా సొంతమైంది. 437 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్‌ 198 పరుగులకే కుప్పకూలింది. 238 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్‌పై రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఘన విజయం సాధిం చింది. ఛేదనలో ఐదో రోజు ఉదయమే మధ్యప్రదేశ్‌ చేతులెత్తేసింది. 81/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన మధ్యప్రదేశ్‌..58.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లు సౌరభ్‌ కుమార్‌ (3/60), నారంగ్‌ (2/27), ముఖేశ్‌ కుమార్‌ (2/34), సేతు (2/37) సమిష్టిగా రాణించారు. కెప్టెన్‌ హిమాన్షు మంత్రి (51), హర్ష్‌ గవ్లీ (48) రాణించినా.. మధ్యప్రదేశ్‌కు ఓటమి తప్ప లేదు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్‌ (213) ద్వి శతకంతో చెలరేగాడు. మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్‌ (144) మరో శతకంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఇరానీ కప్‌ను రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా సొంతం చేసుకుంది.