కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి డివిజన్ హైటెన్షన్ లైన్ రోడ్ సాయిబాబానగర్ నుండి పాపారాయుడు నగర్, వడ్డెపల్లి ఎన్‌క్లేవ్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమై, గతుకుల రోడ్డులో ప్రయాణిస్తూ వాహనదారులు గతి తప్పి ప్రమాదాల బారిన పడుతూ, గాయాల పాలై ఆస్పత్రుల్లో డబ్బు ఖర్చు చేసుకుంటున్నారు. కూకట్‌పల్లి నుండి జగద్గిరిగుట్టవైపు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉండే ఈ సీసీి రోడ్డు వేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. జీహెచ్‌ఎమ్‌సి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి వెరసి నాసిరకం రోడ్డు నిర్మాణం చేయడం వల్ల ఒక్క వర్షాకాలంలో పూర్తిగా గతుకులమయం కావడం వాహనదారులకు శాపంగా పరిణమించింది. గతంలో నూ ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ, అధికారుల్లోను ఎలాంటి స్పందన లేకపోవడం, అలాగే ఈ రహదారిలో నిత్యం ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రయాణిస్తున్నప్పటికి రోడ్డు దుస్థితి చూసీ చూడనట్టుగా వ్యవహరించడం, మరమ్మతులకు నోచుకోలేకపోవడం వలన స్థానిక ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రజా ప్రతినిధులు, సంబంధిత జీహెచ్‌ఎమ్‌సి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.