వందెకరాల భూదాన భూములను పేదలకు ఇండ్లస్థలాలివ్వండి

– సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 216 నుంచి 224 వరకు గల సుమారు వందెకరాల భూదాన భూములను పేదలకు ఇంటిస్థలాల పట్టాలివ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేకర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. భూకబ్జాదారులు వివిధ బోగస్‌ పత్రాలు చూపి భూమిని ఆక్రమించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రికార్డులను మార్చి ప్రయివేటు భూములుగా చిత్రీకరించి అక్రమాలకు పాల్పడుతూ కోర్టు వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఆ భూములను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు.