వంద వీరుడు

నవతెలంగాణ-న్యూఢిల్లీ
 టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజార కెరీర్‌ మైలురాయి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. నేడు ఆస్ట్రేలియాతో న్యూఢిల్లీ టెస్టులో పుజార కెరీర్‌ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడనున్నాడు. భారత్‌కు వంద టెస్టులు ఆడిన దిగ్గజాల క్లబ్‌లో పుజార చేరనున్నాడు. సచిన్‌ (200), ద్రవిడ్‌ (163), లక్ష్మణ్‌ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్‌ (131) భారత్‌కు అత్యధిక టెస్టులు ఆడిన టాప్‌-5 జాబితాలో ఉండగా.. భారత్‌కు టెస్టుల్లో 100 మ్యాచులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజార నిలువనున్నాడు. ప్రస్తుత టెస్టులో విరాట్‌ కోహ్లి (105) ఒక్కడే వంద టెస్టుల అనుభవం కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియాతో 2010 బెంగళూర్‌ టెస్టులో అరంగేట్రం చేసిన పుజార.. ఇప్పుడే అదే జట్టుపై న్యూఢిల్లీలో వందో టెస్టుకు సై అంటున్నాడు. 99 టెస్టుల్లో 169 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసిన పుజార.. 44.15 సగటు, 44.44 స్ట్రయిక్‌రేట్‌తో 7021 పరుగులు సాధించాడు. 19 శతకాలు, 34 అర్థ సెంచరీలు బాదిన పుజార.. 84 బౌండరీలు, 15 సిక్సర్లు సంధించాడు. ద్రవిడ్‌ తర్వాత టీమ్‌ ఇండియా ది వాల్‌గా నిలిచిన పుజార కెరీర్‌లో 15797 బంతులు ఎదుర్కొన్నాడు. టెస్టుల్లో పుజార అత్యధిక స్కోరు అజేయ 206 పరుగులు. టెస్టు నిపుణుడిగా జట్టులో కొనసాగుతున్న పుజార.. అందుకు తగిన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఓ సమయంలో స్ట్రయిక్‌రేట్‌ అంశంలో జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న పుజార ఆ సమస్యను అధిగమించాడు. ఇటీవల ఇంగ్లీష్‌ కౌంటీ సీజన్‌లో ధనధన్‌ విశ్వరూపం సైతం ఆవిష్కరించాడు. ఆస్ట్రేలియాలో వరుస టెస్టు సిరీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గత పర్యటనలో యువ క్రికెటర్లకు తోడుగా నిలుస్తూ.. గబ్బా, సిడ్నీ టెస్టుల్లో విజయాలు సాధించిన తీరు అమోఘం. కెరీర్‌ మైలురాయి మ్యాచ్‌లో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడేందుకు పుజారా ఎదురుచూస్తున్నాడు.