వెనిజులా విప్లవ నేత చావెజ్‌కు

–  పలువురు నేతల నివాళులు
లాపాజ్‌: వెనిజులా కమాండర్‌, విప్లవ నేత చావెజ్‌ వర్థంతి సందర్భం గా పలువురు ప్రపంచ నేతలు ఆయనకు నివాళులర్పించారు. వెనిజులా ప్రజలపై సామ్రాజ్యవాదం దాడి చేసినప్పటికీ, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల అధ్యక్షులు, మంత్రులు, పలువురు నేతలు వెనిజులా విప్లవ నేత హ్యూగో చావెజ్‌కు నివాళులర్పించేందుకు సమావేశమయ్యారని మాజీ అధ్యక్షులు హౌండురాస్‌, మాన్యుయెల్‌ జలయ పేర్కొన్నారు. చావెజ్‌ మరణించి పదేండ్లు అయినప్పటికీ.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు అధ్యక్షులు కొరియా, ఎవో, లులా, క్రిస్టినా, రౌల్‌, డేనియల్‌లతో పాటు లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల మంత్రులు… ఇప్పుడు ఇక్కడ కలిసి ఉన్నామని అన్నారు. ఆయన హేతు బద్ధంగా, ఆచరణాత్మకంగా, స్వేచ్ఛాయుత జీవనంతో ప్రత్యేక వ్యక్తిగా నిలిచారని మాన్యుయెల్‌ అన్నారు. ప్రజలను దోచుకోనే, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను అడ్డుకునే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. చావెజ్‌కు నివాళి అర్పించడమంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమేనని బొలీవియా నేత ఇవొ మొర్లెస్‌ అన్నారు. చావెజ్‌ భౌతికంగా నిష్క్రమించినప్పటికీ.. ఆయన చూపించిన వెలకట్టలేని ఆప్యాయత, సంఘీభావం మనతోనే ఉంటాయని ఈక్వెడార్‌ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ అన్నారు. చావెజ్‌ జీవించి ఉన్నారనీ, ఆయన అంకిత భావానికి, దాతృత్వానికి, మనం అర్పించే అత్యుత్తమ నివాళిని ఎప్పటికీ వదులుకోకూడదని అన్నారు. వెనిజులా నేడు సామ్రాజ్యవాద దురాక్రమణ కింద నలిగిపోతోందని, అయితే చావెజ్‌ స్ఫూర్తితో ప్రజలు గెలుపు సాధించి తీరుతారని అన్నారు.