వ్యవస్థ మారాలి

–  లేదంటే మరో సానియాను చూడలేం
–  వ్యవస్థీకృత క్రీడా రంగం అవసరం
–  టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వ్యాఖ్యలు
వ్యవస్థీకృత క్రీడా రంగం. భారత్‌లో ఈ పదానికి పెద్దగా విలువ లేదు!. సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, పి.వి సింధు సహా నవతరం వర్థమాన క్రికెటర్లు త్రిష, యశశ్రీలు ఎవరూ ప్రభుత్వ క్రీడా వ్యవస్థ నుంచీ రాలేదు. అందరూ కుటుంబ సభ్యుల తోడ్పాటు, వెలకట్టలేని త్యాగాల ఫలితంగానే క్రీడల్లో చాంపియన్లుగా నిలిచారు. వ్యవస్థ సహకారంతో, వ్యవస్థ ద్వారా చాంపియన్లు నిలిచిన వారు ఇక్కడ ఎవరూ లేరు!. ఇదే విషయాన్ని టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా కుండ బద్దలు కొట్టింది. భారత టెన్నిస్‌ను, భారత క్రీడా రంగంలో మహిళల స్థానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాదీ ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై (ఎల్బీ ఇండోర్‌ స్టేడియం) ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో పరిపూర్ణ వీడ్కోలుకు సిద్ధమవుతున్న సానియా మీర్జా శనివారం తన టెన్నిస్‌ అకాడమీలో మీడియాతో ముచ్చటించింది. ఆ విషయాలు..
నవతెలంగాణ-హైదరాబాద్‌
మంచి వ్యవస్థ కావాలి
అమెరికా సహా ఇతర దేశాల్లో క్రీడలకు మంచి వ్యవస్థలు ఉన్నాయి. సంస్థాగత వ్యవస్థలతో ఇతర దేశాలు వరుసగా ఏడాదికో చాంపియన్‌ను తయారు చేస్తున్నాం. అదే ఇక్కడ మన దగ్గర పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అందుకే 20-30 ఏండ్లకు ఒక చాంపియన్‌ పుట్టుకొస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లోకి పంపించేందుకు తొలుత ప్రొఫెషనలిజం అవసరం. అది ప్రస్తుతం మన దగ్గర ఏమాత్రం లేదు.
మార్పు అవసరం
గత 40-50 ఏండ్లలో భారత్‌ నుంచి ఏటీపీ, డబ్లూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లో నిలిచిన ఆటగాళ్లను ఎవరినైనా అడగండి. విజరు, ఆనంద్‌, మహేశ్‌, లియాండర్‌, రోహన్‌, నేను.. ఎవరైనా చెప్పేది ఒక్కటే. మేము వ్యవస్థ సహకారంతో ఎదగలేం. వ్యవస్థ సహకారం లోపించినా, అవరోధాలు ఎదురైనా అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకున్నాం. అప్పట్లో హైదరాబాద్‌లో హార్డ్‌కోర్టు సౌకర్యమే లేదు. ఒక వ్యక్తి తన ఇంట్లో హార్డ్‌ కోర్టు ఏర్పాటు చేసుకుంటే.. అతడి అనుమతితోనే అక్కడ ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. ఇది ఎంత హ్యాస్యాస్పదం. వ్యవస్థలో మార్పు అనివార్యం. వ్యవస్థలో మార్పు తీసుకురాకుంటే.. మరో 20 ఏండ్ల తర్వాత సైతం మరో సానియా ఎక్కడీ అనే ప్రశ్నే ఎదురవుతుంది.
నా భాగస్వామ్యం ఉంటుంది
సరైన సదుపాయాలు, సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఉంటే ఏ క్రీడల్లోనైనా ఫలితాలు వస్తాయి. కొన్ని ఆటల్లో ఫలితం సులభంగా రావచ్చు, మరికొన్ని ఆటల్లో అది కాస్త కష్టంగా రావచ్చు. కానీ వ్యవస్థను గాడిలో పెడితే ఫలితాలు కచ్చితంగా సాధ్యపడతాయి. జూనియర్‌ లెవల్‌, అన్ని స్థాయిల్లో టోర్నమెంట్లు.. ఇలా ఏం చేయాలనే అంశంపై నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఒకవేళ వ్యవస్థలో మార్పు కోసం నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నేను అందులో భాగమవుతాను. వర్థమాన క్రీడాకారుల అభివృద్దికి నా వంతు సహకారం అందిస్తాను.
అదొక్కటే లోటు
సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌కు నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాను. 2016 రియో ఒలింపిక్స్‌ సెమీఫైనల్స్‌ ఫలితం భిన్నంగా రావాల్సింది. కొన్ని కలలు సాకారం అవుతాయి, కొన్ని కలలు సాకారం కావు. నేను సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడతాను. కానీ ఒలింపిక్‌ పతకం కలగానే మిగిలింది. ఒలింపిక్‌ మెడ ల్‌ సాధించి ఉంటే నా కెరీర్‌ పరిపూర్ణమయ్యేది.
డబ్ల్యూపీఎల్‌ ఓ మైలురాయి
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మహిళల క్రికెట్‌లో ఓ మైలురాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మెంటార్‌గా ఆ జట్టు సభ్యులతో మాట్లాడాను. అందరూ కఠోరంగా శ్రమించే యువ క్రికెటర్లు. అత్యధికంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చిన అమ్మాయిలే ఉన్నారు. వేలంలో డబ్బులు పెట్టి క్రికెటర్లను కొనుగోలు చేసి, లీగ్‌ ఆడతారనే భావన 20 ఏండ్ల కిందట ఎవరూ ఊహించనిది. డబ్ల్యూపీఎల్‌తో మహిళల క్రికెట్‌లో గణనీయమైన మార్పు రానుంది.
టెన్నిస్‌లో ఇప్పుడు కష్టమే!
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తరహాలో టెన్నిస్‌లోనూ లీగ్‌ నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదు. భారత్‌లో క్రికెట్‌ను ఏ క్రీడతోనూ పోల్చలేం. క్రికెట్‌లో అన్ని రాష్ట్రాల్లో, అన్ని స్థాయిల్లో క్రీడాకారులు అందుబాటులో ఉన్నారు. టెన్నిస్‌లో పరిస్థితి వేరు. టెన్నిస్‌లో అడుగుపెట్టిన వారు మధ్యలోనే వదిలేస్తున్నారు. నిలకడగా రాణించగలిగే క్రీడాకారుల బృందాలు అందుబాటులో ఉంటేనే లీగ్‌లు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. టెన్నిస్‌లో లీగ్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది.
నేడు చివరి ఆట
20 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు సొంతగడ్డపైనే పరిపూర్ణంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది సానియా మీర్జా. ఎల్బీ స్టేడియంలో ప్రొఫెషనల్‌ కెరీర్‌ను మొదలెట్టిన సానియా మీర్జా.. ఇప్పుడు అక్కడే చివరిసారిగా రాకెట్‌ పట్టనుంది. ఇటీవల దుబారు ఓపెన్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికింది సానియా. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల సమక్షంలో నేడు చివరి సారి ఆడనుంది. ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచుల్లో సానియా మెరువనుంది. ఇవాన్‌ డోడిగ్‌, రోహన్‌ బోపన్న, మరియన్‌ బర్తోలి, బెతానీ మాటెక్‌, కారా బ్లాక్‌లతో కలిసి నేడు సానియా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆడనుంది. ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్‌ మ్యాచులు ఆరంభం కానున్నాయి.