శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

నవ తెలంగాణ-ఉప్పల్‌
పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం హౌం మంత్రి మహమూద్‌ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి చేతుల మీదుగా ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవన సముదాయం ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తూనే ఉందని తెలిపారు. ఎన్నో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. సీసీ టీవీల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, నేర దర్యాప్తులో, నేర నియంత్రణలో సీసీ టీవీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. పోలీసు శాఖ రాత్రి పగలు తమ విధులను అలుపెరగకుండా నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అభినందించారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, వారికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. హైదరాబాదు నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకపోవడం వల్లే సాఫ్ట్‌ వేర్‌ రంగం అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ డీజీపీ అంజని కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని, పోలీసు శాఖలోని పలు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాయని చెప్పారు. రాచకొండ కమిషనర్‌ డి.ఎస్‌. చౌహాన్‌ మాట్లాడుతూ, విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన రాచకొండ కమిషనరేట్‌ నేర నియంత్రణలో కూడా అగ్ర స్థానంలో ఉందని, సీసీ టీవీల నిర్వహణ ద్వారా నేర దర్యాప్తు అతి త్వరగా సాధ్యం అవుతోందన్నారు. రాచకొండ పరిధిలో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలతో పాటు, సమీప జిల్లాల గ్రామీణ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయని, అయినా పోలీసులు రాత్రి పగలు నిబద్ధతతో పనిచేస్తూ నేర శాతం అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడుతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ పోలీస్‌ హౌజింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీసీపీ-1 ట్రాఫిక్‌ అభిషేక్‌ మహంతి, డీసీపీ-2 ట్రాఫిక్‌ శ్రీనివాస్‌, డీసీపీ మల్కాజ్‌ గిరి జానకి ధరావత్‌, డీసీపీ ఎల్బీనగర్‌ సాయి శ్రీ, డీసీపీ అడ్మిన్‌ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్‌ నర్మద, అదనపు డీసీపీ షమీర్‌, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.