– సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
నవతెలంగాణ-ముషీరాబాద్
శాస్త్రీయ నృత్య గురువులకు కళాబంధు ప్రకటించాలని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రజాసంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం శాస్త్రీయ నృత్య గురువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేసి గౌరవవేతనం ప్రకటించాలన్నారు. లలిత కళాతోరణం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయంలోని కళావేదికలను ఉచితంగా ఇవ్వాలన్నారు. మార్చి ఒకటో తేదీన నృత్య గురువుల సమ్మేళనం.. ప్రజాపాటలను శాస్త్రీయ నృత్య నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజాసంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు రమేష్, సామాజిక కార్యకర్త సుజావతి, ముఖ్య గురువులు అనీష, మధుసూదన్ రావు, కృష్ణ, వాల్మీకి, నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.