సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు


హైదరాబాద్‌:
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ) 4,233 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. 585 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులను నడుపనుంది. ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బస్‌భవన్‌ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్‌ఎంలు, డీఎంలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతేడాది కన్నా ఈ సంక్రాంతికి 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ సమయాన్ని 30 నుంచి 60 రోజులకు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం – 125, కాకినాడ-117, కందుకూరు-83, విశాఖపట్నం-65, పోలవరం-51, రాజమండ్రి -40 ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.