సర్ఫరాజ్‌ ఔట్‌

–  రెస్టాఫ్‌ ఇండియాకు మయాంక్‌ సారథ్యం
–  మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్‌ 2023
ముంబయి : దేశవాళీ సర్క్యూట్‌లో పరుగుల మోత మోగిస్తూ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇరానీ కప్‌కు దూరమయ్యాడు. చేతి వేలికి గాయంతో సర్ఫరాజ్‌ ఖాన్‌కు 8-10 రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. డివై పాటిల్‌ టీ20 చాంపియన్‌షిప్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ గాయపడ్డాడు. దీంతో కీలక ఇరానీ కప్‌ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ రెస్టాఫ్‌ ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. గత ఏడాది భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన మయాంక్‌ అగర్వాల్‌ ఇరానీ కప్‌లో రాణించి సెలక్టర్ల మెప్పు పొందేందుకు ఎదురు చూస్తున్నాడు. ఆదిత్య శ్రీవాత్సవ గైర్హాజరీలో మధ్యప్రదేశ్‌ జట్టుకు హిమాన్షు మంత్రి కెప్టెన్సీ వహించనున్నాడు. 2021-22 రంజీ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ గత ఏడాది ఇరానీ కప్‌ ఆడాలి. కానీ 2019-20 చాంపియన్‌ సౌరాష్ట్ర కోవిడ్‌-19 పరిస్థితుల్లో ఇరానీ కప్‌ ఆడలేదు. దీంతో నిరుడు సౌరాష్ట్ర ఇరానీ కప్‌ ఆడింది. ఈ ఏడాది ఇరానీ కప్‌ అవకాశం మధ్యప్రదేశ్‌కు అందించారు. ఈ ఏడాది రంజీ చాంపియన్‌గా మళ్లీ సౌరాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. ఇరానీ కప్‌ మ్యాచ్‌ మార్చి 1 నుంచి గ్వాలియర్‌లో జరుగనుంది. తొలుత ఈ మ్యాచ్‌ను ఇండోర్‌కు కేటాయించినా.. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టు నేపథ్యంలో వేదికను గ్వాలియర్‌కు మార్చారు.
రెస్టాఫ్‌ ఇండియా : మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), సుదీప్‌ కుమార్‌, యశస్వి జైస్వాల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, హార్విక్‌ దేశారు, ముఖేశ్‌ కుమార్‌, అటిట్‌ సేతు, చేతన్‌ సకారియ, నవదీప్‌ సైని, ఉపేంద్ర యాదవ్‌ (వికెట్‌ కీపర్‌), మయాంక్‌ మార్కండె, సౌరభ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌, బి. ఇంద్రజిత్‌, నారంగ్‌, యశ్‌ ధుల్‌.
మధ్యప్రదేశ్‌ జట్టు : హిమాన్షు మంత్రి (కెప్టెన్‌), రజత్‌ పటీదార్‌, యశ్‌ దూబె, హార్ష్‌ గావ్లీ, శుభం శర్మ, వెంకటేశ్‌ అయ్యర్‌, రఘవంశీ, ఆమన్‌ సోలంకి, కుమార్‌ కార్తికేయ, శరణ్‌ జైన్‌, అవేశ్‌ ఖాన్‌, అంకిత్‌ కుశ్వా, గౌరవ్‌ యాదవ్‌, అనుభవ్‌ అగర్వాల్‌, మిహిర్‌ హిర్వాని.