సర్వసాధారణంగా సర్వసభ్య సమావేశం

– అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు పుస్తెల తాళ్లు అమ్ముకోవాల్సిన దుస్థితి
– ఎమ్మెల్యే చొరవతో పెండిగ్‌ నిధులు మంజూరు చేయాలి : సభ్యులు
నవతెలంగాణ-ఆమనగల్‌
ఎంపీటీసీల నిరసనతో మంగళవారం వాయిదా పడిన కడ్తాల్‌ మండల సర్వసభ్య సమావేశం బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఎంపీపీ కమ్లి మోత్యానాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ హాజరై, మాట్లాడుతూ నిధులు, విధులు తదితర అంశాలపై ఎంపీటీసీలు చేపట్టిన నిరసనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని సభ్యులకు హామీనిచ్చారు. సమావేశంలో భాగంగా ఆయా గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సభకు విన్నవించారు. అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులు తీర్చడానికి పుస్తెల తాళ్లు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోయారు. ఎమ్మెల్యే చొరవ చూపి వెంటనే పెండింగ్‌ నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌ మాట్లాడారు.
అభివృద్ధి జాడేదని జడ్పీటీసీ ఆగ్రహం
కడ్తాల్‌ మండల కేంద్రంగా ఏర్పడి ఆరేండ్లు పూర్తైనా అభివృద్ధి జాడేదని జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌ సభా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూర్బా పాఠశాల భవనం నిర్మాణ పనులు ప్రారంభించి, మూడేండ్లు పూర్తైన ఆ భవన నిర్మాణ పనులు ఎందుకు నత్త నడకన సాగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు ప్రారంభమైన చౌదరిగూడలో కస్తూర్బా భవన నిర్మాణ పనులు పూర్తి కాగా ఇక్కడ పూర్తి కాకపోవడంలో నిర్లక్ష్యం ఎవరిదని నిలదీశారు. అద్దె భవనంలో కస్తూర్బా విద్యార్థులు ఇంకా ఎన్ని రోజులు అవస్థ పడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండలంలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌ భవనాల నిర్మాణాలు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. 321, 260 సర్వే నెంబర్‌ లలోని వ్యవసాయ భూములను జిల్లా యంత్రాంగం నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి సంబంధించి జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా రాత్రి రాత్రే ఆర్డర్లు చేస్తే మేమేమి కావలి? తామంతా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమని ఆయన గుర్తు చేశారు. పదవులు మాదగ్గరకు వచ్చాయని మేము పదవుల దగ్గరకు వెళ్లలేదని జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సభకు విన్నవించారు. ఈసమావేశంలో ఎంపీటీసీలు లచ్ఛిరామ్‌ నాయక్‌, సినిమా ప్రియా రమేష్‌, నిర్మల, ఆయా గ్రామాల సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి, యాదయ్య, బాగ్యమ్మ జంగయ్య, సుగుణ సాయిలు, సులోచన సాయిలు, హరిచంద్‌ నాయక్‌, రాములు, శంకర్‌, పాండు నాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.