సూర్యుడు

లోకం తట్టుకోలేని వెలుగును
తనలో దాచుకొని ఉంటాడు,
ప్రతిరోజూ
పసిపాప కళ్ళు తెరిచినట్లు
మెల్లిమెల్లిగా మేల్కొని
అల్లరల్లరి చేస్తాడు,
తాను అలసిపోగానే
మనల్ని హాయిగా నిద్రబుచ్చి
మరో లోకానికి పయనిస్తాడు!

పిల్లాడిలా ఎప్పుడూ పాకుతూ
కరములనే కిరణాలుగా వెదజల్లి
అంతా తానై అల్లుకుపోతాడు,
బంతిలా ఎప్పుడూ దొర్లుతూ
అందరి ఎదలోకి దూరిపోతాడు!

నెత్తి మీదికి ఎక్కి
ఒక్కోసారి విసిగిస్తాడని
అందరూ తిట్టుకుంటారే గానీ,
ఒక్కక్షణం తాను లేకపోతే
అందరూ అల్లాడిపోతారు!

అప్పుడప్పుడు
మేఘాలపరుపులపై కునుకు తీస్తూ
కాసింత నీడవరాన్ని అందిస్తాడు,
వరదలు ముంచెత్తినా
చలిపులి పంజా విసిరినా
కంటిచూపుతో కట్టడిచేస్తాడు!

సూర్యుడు
ప్రతిరోజూ నిండు చందమామే,
అతనికి ఏ పక్షమూ లేదు
అందరి పక్షమై
వెలుగుదారులను చూపిస్తూ
బతుకుముద్దలు తినిపిస్తాడు!

ఎంత గొప్పోడైనా
అతని ముందు మిణుగురు పురుగే,
అందుకే లోకాలన్నీ గోళాలై
అతని చుట్టే ప్రదక్షిణం చేస్తాయి!

కాంతి
అతని ఒక్కడిదే కావచ్చు కానీ,
అందరి కళ్ళల్లో ఉండేది
అతడు పంచిన వెలుగే!

– పుట్టి గిరిధర్‌,
9494962080