స్పందన బాగుంది!

– పీవీఎల్‌తో భారత వాలీబాల్‌కు లబ్ది
– పీవీఎల్‌ సీఈవో జో భట్టాచార్య
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సీజన్‌2కు అభిమానుల్లో స్పందన బ్రహ్మాండంగా ఉందని లీగ్‌ సీఈవో జో భట్టాచార్య అన్నారు. భారత వాలీబాల్‌కు ప్రైమ్‌ వాలీబాల్‌ దీర్ఘకాలంలో గొప్ప లబ్ది చేకూర్చుతుందని ఆయన తెలిపారు. ప్రైమ్‌ వాలీబాలీగ్‌ హైదరాబాద్‌ అంచె మ్యాచులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జో భట్టాచార్య మీడియాతో మాట్లాడారు. ‘ఈ సీజన్‌లో అతిపెద్ద సానుకూలత యువ ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. ఇది భారత వాలీబాల్‌కు భవిష్యత్‌లో లాభం చేకూర్చుతుంది. ఈ ఏడాది మ్యాచులకు అభిమానులకు అనుమతించారు. బెంగళూర్‌, హైదరాబాద్‌ అంచె మ్యాచులకు అభిమానుల నుంచి స్పందన బాగుంది. నిర్వహణ పరంగా ఈ ఏడాది మరింత కష్టమైనా.. అభిమానుల స్పందనతో సంతోషంగా ఉంది. గత ఏడాదితో పోల్చితే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా సన్నద్ధమయ్యేందుకు జట్లకు ఎక్కువ సమయం లభించింది. సీజన్‌లో చాలా మ్యాచుల్లో భారత ఆటగాళ్లు విదేశీ స్టార్‌ ఆటగాళ్లను సబ్‌స్టిట్యూట్‌ చేశారు. ఇక టెలివిజన్‌, ఓటీటీల్లో వీక్షణలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆటగాళ్ల నుంచి, జట్ల యాజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ ఉత్సాహభరితంగా ఉంది. లీగ్‌ను ముందుకు తీసుకెళ్లటంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ విజేత ప్రపం క్లబ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం’ అని జో భట్టాచార్య తెలిపారు.
త్వరలో మహిళల లీగ్‌! : ప్రస్తుతం ప్రసారదా రుతో మూడేండ్ల ఒప్పందం ఉంది. వచ్చే ఏడాది లీగ్‌ను మరో స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళి కలు ఉన్నాయి. మహిళల వాలీబాల్‌ లీగ్‌తో పాటు బీచ్‌ వాలీబాల్‌ లీగ్‌ నిర్వహణ ఆలోచనలు సైతం ఉన్నాయి. అయితే ఇప్పటికప్పుడు ఇవి పట్టాలెక్కకపోయినా.. రానున్న కాలంలో కచ్చితంగా మహిళల వాలీబాల్‌ లీగ్‌, బీచ్‌ వాలీబాల్‌ లీగ్‌ కార్యరూపం దాల్చుతాయని భట్టాచార్య విశ్వాసం వెలిబుచ్చారు.