హఫిజ్‌పూర్‌ రైతులను దగా చేసిన ధరణి

– కాస్తు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలి
– ప్రభుత్వ భూములపై మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను
– వ్యాపారుల ద్వారా అక్రమార్గంలో కబ్జాలు
– కబ్జాలు నివారించకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు
– హఫిజ్‌పూర్‌ రైతులందరికీ హక్కులు కల్పించాలి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి
– జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతి
– జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రైతుల ధర్నా
– ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నూతన విధానం పేరుతో ఆఫీజ్‌పూర్‌ రైతులను ధరణి దగా చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి ఆరోపించారు. గత 60 ఏండ్లుగా కాస్తు చేస్తున్న రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి అనుబంధమైన హాఫీజ్‌పూర్‌ రెవెన్యూ పరిధిలోని 36/1 సర్వేనెంబర్‌ నుంచి 48 సర్వే నెంబర్‌ వరకు భూమిలో సాగు చేసుకుంటున్న 450 కుటుంబాల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎదుట నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1967 నుంచి దళిత, బడుగు వర్గాల రైతులు ప్రభుత్వ నుంచి పట్టా సర్టిఫికెట్లు పొంది సాగు చేసుకుంటున్నారని చెప్పారు. రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.కానీ ప్రభుత్వం ఆ రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చకపోగా, నూతన పాస్‌ పుస్తకాల జారీని నిలిపివేసిందన్నారు. కోర్టు కేసుల పేరుతో కొంతమంది ప్రభుత్వ పెద్దల ఆడిస్తున్న నాటకమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భూములపై ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని ఆ భూములపైకి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను పంపిస్తూ అక్రమార్గంలో రిజిస్ట్రేషన్లు చేసుకునే తతంగానికి పూనుకుంటున్నారని చెప్పారు. ఆ విధంగానే ఆఫీజ్‌పూర్‌ భూములను కూడా ప్రభుత్వ పెద్దలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని గుర్తు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్టార్‌ను సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి నుంచి ఆ భూములను సాగు చేస్తున్న రైతులకు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా ప్రభుత్వ మోసం చేసిందన్నారు. అంతకు ముందు బ్యాంకుల్లోనూ పంట రుణాలు తీసుకున్న రైతులు ధరణి పేరుతో జారీ చేసిన నూతన పాసుబుక్కులను హాఫీజ్‌పూర్‌ రైతులకు ఇవ్వకపోవడంతోనే ప్రభుత్వ సహాయానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు విధించిన రైతులు ఆ భూములను వదిలిపెట్టకుండా సాగుకు యోగ్యంగా మార్చుకుని పంటలు పండిస్తున్నారని చెప్పారు. అవసరమైతే కోర్టులో కూడా రైతుల పక్షాన కేసువేయడానికి కూడా వెనకడబోమన్నారు. త్వరలోనే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వాస్తవాలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి బందం పర్యటిస్తుందని గుర్తు చేశారు. చివరి కంటా భూములు దక్కేవరకు రైతుల పక్షాన తెలంగాణ రైతు సంఘం నిలబడి మాట్లాడు తుందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను ఇబ్బంది గురిచేసి పెద్దలకు ఈ భూములు ధారదత్తం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో అనేక సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినా స్పందన లేదన్నారు. గతం నుంచి కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నా ఈ భూమిపై కేసులు వేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పాత పట్టాదారు పాసుపుస్తకాలు ప్రతి రైతుకు ఇచ్చారని ధరణి పాసుబుక్కులు మాత్రమే ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఇప్పటికైనా హాఫీజ్‌పూర్‌ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రామకష్ణారెడ్డి, ముసలయ్య, జిల్లా నాయకులు వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, అంజయ్య,కె.జగన్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు సామెల్‌, రైతు సంఘం నాయకులు గుడేటి వెంకటేష్‌, రవి, సీహెచ్‌ నాగేశ్వరరావు, లింగం, లింగస్వామి, రమేష్‌, యాదగిరి, తదితరులు ఉన్నారు.