గత 23 రోజులుగా మృతువుతో పోరాడిన హీరో తారకరత్న (40) కన్నుమూశారు. జనవరి 27న ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకి గురయ్యారు. తొలుత కుప్పం, తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు.ఎన్టీఆర్ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన ఒకేరోజు ఏకంగా 9 సినిమాల ప్రారంభోత్సవంతో రికార్డ్ సృష్టించారు. 2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమై, ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ వంటి తదితర చిత్రాలతో మెప్పించారు. ‘అమరావతి’ చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండే తారకరత్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. తారకరత్న అకాలమృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.