– ప్రముఖ సినీ నటుడు సుమన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఈనెల 27న నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమన్ షోటోకాన్ అకాడమీ వ్యవస్థాపకులు నటుడు సుమన్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి అందే శ్రీనివాస్‌లతో కలిసి కరాటే పోటీల ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాడమీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని జాతీయ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు మూడు వేల మంది వరకు పాల్గొంటారని తెలిపారు. నాలుగేండ్ల నుంచి 60 ఏండ్ల వయసు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. విజేతలకు పథకాలతో పాటు నగదు బహుమతులను సైతం అందజేస్తామన్నారు. పోటీలకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్,శ్రీనివాస్ గౌడ్‌లతోపాటు ఎంపీ వద్ది రాజు రవిచంద్ర పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ జెల్లెల్ల శ్రీనివాస్, రాజేష్, రమేష్, హరి తదితరులు పాల్గొన్నారు.