హైదరాబాద్‌ అద్భుత నగరం

–  ఆసియాన్‌ మీడియా ప్రతినిధుల ప్రసంశ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో అద్భుతంగా ఉందని ఆసియన్‌ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో భాగం చేసుకోవాలని యువతకు సూచిస్తామని చెప్పారు. ఆసియాన్‌ -ఇండియా మీడియా ఎక్చేంజ్‌లో భాగంగా మియన్మార్‌, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, బ్రూనై, పిలిప్పీన్స్‌, మలేసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బందం రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా వారు హైదరాబాద్‌లోని పలు పారిశ్రామిక, చారిత్రక, వాణిజ్య ఆర్థిక సంస్థలను సందర్శించారు. ఆసియాన్‌ మీడియా పర్యటనను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయం చేసింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన పర్యాటక బస్‌ ద్వారా వాహన సదుపాయం కల్పించారు. ఆసియన్‌ సెక్రటేరియట్‌కు చెందిన సీనియర్‌ ఆఫీసర్‌ పత్గియా టెన్‌ఫ్యుంగ్‌ ఆధ్వర్యంలో ఈ బందం పర్యటించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చదనంతో ఆహ్లాదకరంగా వున్నదని వారు పేర్కొన్నారు. బుదవారం ఈ బృందం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సింగపూర్‌ ద్వారా ఆసియన్‌ మీడియా ప్రతినిధులు ఆయా దేశాలకు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆసియన్‌ మీడియా ప్రతినిధులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు బి. రాజమౌళి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి వివరించారు. తమ పర్యటనలో భాగంగా ఈ బృందం షామీర్‌పేటలో జరిగిన నాల్గవ ఆసియన్‌-ఇండియా యూత్‌ సమ్మిట్‌లో పాల్గొన్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో వారు పర్యటించారు. భారత్‌ బయోటెక్‌ను సందర్శించి, ఫార్మా రంగంలో హైదరాబాద్‌ సాధించిన ప్రగతిని, వ్యాధుల నియంత్రణకు తయారు చేస్తున్న వాక్సిన్ల గురించి తెలుసుకున్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, శిల్పారామం, సాలార్జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ తదితర ప్రాంతాలను సందర్శించారు. పర్యటన గుర్తుగా కొన్ని వస్త్రాలు, అలంకరణ వస్తువులను మీడియా ప్రతినిధులు కొనుగోలు చేశారని సమాచార, పౌరసంబంధాల శాఖ తెలిపింది.