హైనా దాడిలో 46 గొర్రెలు మృత్యువాత

నవతెలంగాణ-ఆమనగల్‌
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మక్తమాధారం గ్రామంలో శనివారం రాత్రి కట్ల శ్రీశైలం గొర్ల మందపై హైనా దాడి చేసింది. ఈ ఘటనలో మందలోని 46 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇందులో 30 గొర్రెలు ఘటన సమయంలోనే మృతి చెందగా, 13 తీవ్ర గాయాలకు గురై చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృత్యువాతపడ్డాయి. అదేవిధంగా మిగిలిన 3 గొర్రెలు కనిపించకుండా పోయినట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు, పశువైద్య శాఖ అధికారులు విజరు భాస్కర్‌ రెడ్డి, భాను నాయక్‌ ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నివేదిక రూపొందించి జిల్లా ఉన్నత అధికారులకు నివేదిస్తామని చెప్పారు. బాధితుడు శ్రీశైలంను కడ్తాల్‌ మండల జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ పరామర్శించి రూ.10వేలు అందజేశారు. కాంగ్రెస్‌ నేతలు రూ. 6 వేల ఆర్థిక సాయం చేశారు.