హ్యాండ్‌బాల్‌ చాంప్‌ భారత్‌

–  ఆసియా ప్రెసిడెంట్‌ కప్‌ కైవసం
–  విజేతలను అభినందించిన జగన్‌
న్యూఢిల్లీ : హ్యాండ్‌బాల్‌లో టీమ్‌ ఇండియా అమ్మాయిల మరో చరిత్ర. ఆసియా ప్రెసిడెంట్‌ కప్‌ను భారత మహిళల జట్టు తొలిసారి సొంతం చేసుకుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య జోర్డాన్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచింది. టోర్నీలో ఆరు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసింది. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిలో జరిగిన పోటీల్లో తొలుత కువైట్‌పై 41-15, 40-12తో, ఇరాక్‌పై 31-27, 20-20తో, జోర్డాన్‌పై 37-21, 28-21తో మెరుపు విజయాలు సాధించింది. 12 పాయింట్లతో భారత్‌ చాంపియన్‌గా నిలువగా, 8 పాయింట్లతో జోర్డాన్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆసియా ప్రెసిడెంట్‌ కప్‌ విజేతలుగా నిలిచిన అమ్మాయిల జట్టును భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు, ఐఓఏ మాజీ కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండేలు ఘనంగా సన్మానించారు. ‘జాతీయ హ్యాండ్‌బాల్‌ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్నప్పుడే ఒలింపిక్స్‌లో పతకంపై దృష్టి పెట్టాను. వరుస విజయాలతో ఆ లక్ష్యానికి చేరువగా వెళ్తున్నాం. ఒలింపిక్స్‌లో పతకం దిశగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రత్యేకంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయటంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని’ జగన్‌మోహన్‌ రావు తెలిపారు.