ఇంటర్‌ ఫస్టియర్‌లో 1.57 లక్షలు,

– సెకండియర్‌లో 59,624 మంది ఉత్తీర్ణత
– అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ కేటగిరీ నుంచి 2,52,055 మంది పరీక్షలు రాయగా, 1,57,741 (63 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఇందులో 1,12,165 మంది ఇంప్రూవ్‌మెంట్‌, 45,576 ఇంప్రూవ్‌మెంట్‌ కాని వారున్నారని వివరిం చారు. 1,16,292 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 79,801 (68.62 శాతం) ఉత్తీర్ణత పొందారని తెలిపారు. 1,35,763 మంది అబ్బా యిలు పరీక్షలు రాయగా, 77,940 (57.40 శాతం) మంది ఉత్తీర్ణులయ్యా రని పేర్కొన్నారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 11.22 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ కేటగిరీలో 18,687 మంది పరీక్ష రాస్తే, 10,319 (55 శాతం) మంది పాసయ్యారని ఆయన తెలిపారు. వారిలో ఇంప్రూవ్‌మెంట్‌ వారు 1,998 మంది, ఇంప్రూవ్‌మెంట్‌ కానివారు 8,321 మంది ఉన్నారని వివరించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ కేటగిరీలో 1,29,494 మంది పరీక్షలు రాయగా, 59,624 (46 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని పేర్కొన్నారు. వారిలో 51,089 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 25,910 (51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 78,405 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 33,759 (43 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివ రించారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎనిమిది శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో మార్కుల మెమోలను తీసుకోవాలని కోరారు. వాటిలో ఏమైనా తప్పులుంటే పదిరోజుల్లో దరఖాస్తు చేయాలని తెలిపారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం శనివారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేయాలని సూచించారు.