104 ఉద్యోగుల సమ్మె నోటీస్‌ సెప్టెంబర్‌ 25 తర్వాత ఎప్పుడైనా …

– ఆరోగ్య,కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు అందజేత :టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
104 ఎఫ్‌డీహెచ్‌ఎస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌, రాష్ట్ర కార్యదర్శులు వి.విజయవర్థన్‌ రాజు, ఎండీ ఫసియొద్దీన్‌ నాయకత్వంలో ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్‌కు సమ్మె నోటీస్‌ ను అందజేశారు. రాష్ట్రంలో 2008 నుంచి డీఎస్సీ ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయి ంట్‌ పద్ధతిలో నియమితులైన 1,350 మంది 104 ఉద్యోగులు నియ మితులై ప్రభుత్వాధీనంలోనే పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏఎన్‌ఎంలు గత 15 ఏండ్లుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2021 అక్టోబర్‌ 29 నుంచి వాహనాలను పూర్తిగా నిలిపేసిన ప్రభుత్వం వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, టి.హబ్‌ సెంటర్లలో రీ-డిప్లై చేసిందని గుర్తుచేశారు. కరోనా మూడు వేవ్‌లలో వారు సేవలందించారని తెలిపారు. వారికి రెగ్యులరైజేషన్‌కు అర్హతలు ఉన్నప్పటికీ రెగ్యులర్‌ చేయడం లేదనీ, జీవో నెంబర్‌ 60 ప్రకారం ఉద్యోగులకు స్లాబ్‌ల పద్ధతిన వేతనాలు చెల్లించడంతో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాధీనంలోనే పని చేస్తున్నప్పటికీ ఏజెన్సీల ద్వారా చెల్లించడంతో సకాలంలో వేతనాలు అందడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 25 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని తెలిపారు. 104 ఎఫ్‌డీహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు వేతనాలను చెల్లించడంలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలనీ, ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించాలని, సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులను క్రమబద్ధీక రించాలనీ, 104 ఏఎన్‌ఎంలను రెండో ఏఎన్‌ఎంలుగా గుర్తించి రెగ్యులర్‌ చేయాలనీ, ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారం సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. హెల్త్‌ కార్డు లేదా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనీ, 35 క్యాజువల్‌ లీవులు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు అమలుచేయాలనీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీస్‌ అందజేసిన వారిలో మహబూబ్‌ నగర్‌ జిల్లా నాయకులు సుభాష్‌ చందర్‌, వి.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.