– ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్‌లో ఆపరేషన్ బంటి సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. జనావాసాల్లో చేరి అలజడి సృష్టించిన ఎలుగుబంటిని ఎట్టకేలకు అధికారులు బంధించారు. ఉదయం నుంచి ఐదారు గంటల పాటు శ్రమించి మత్తు ఇంజక్షన్లతో బంధించారు. కరీంనగర్ శివార్లలోని రజ్వీ చమాన్ ప్రాంతంలోకి శుక్రవారం రాత్రి ఎలుగుబంటి ఎంటర్ అయింది. రాత్రంతా అక్కడ ఇళ్ల మధ్యే సంచరిస్తూ హల్‌చల్ చేసింది. దీంతో శివారు ప్రాంతాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అక్కడ నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే అక్కడ నుంచి ఏకంగా నడిరోడ్డుపైకే వచ్చింది చిరుత. కరీంనగర్‌లోని రేకుర్తి రోడ్డులో తెల్లవారుజామున ప్రత్యక్షమైంది. రోడ్డుపై పరుగులు తీస్తూ.. జనాన్ని కూడా పరుగులు పెట్టించింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి అక్కడ నుంచి పొదల్లో వెళ్లి నక్కగా.. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి నుంచి ఎలుగుబంటిపై నిఘా పెట్టిన ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కర్రలతో సెర్చ్ ఆపరేషన్ చేసిన ఫారెస్ట్ సిబ్బందిని కూడా భయపెట్టింది ఎలుగుబంటి. వలలు వేసి బంధించేందుకు ప్రయత్నించగా.. అది కూడా విఫలమైంది. వల నుంచి తప్పించుకొని మళ్లీ పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దాంతో మత్తు ఇంజక్షన్లు ప్రయోగించారు ఫారెస్ట్ అధికారులు. ఇంజక్షన్ ఇచ్చినా ఎలుగుబంటి సబ్‌స్టేషన్ కంచె దాటుకొని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే మత్తు ప్రభావంతో స్పృహ తప్పి పడిపోవడంతో అటవీ సిబ్బంది ఎలుగుబంటిని బంధించారు. దీంతో కరీంనగర్ స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.