– నిరంతరంగా కారుణ్య నియామకాలు
– విలేకర్ల సమావేశంలో జీఎం షాలేం రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆగస్టు నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడిన 9.39 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 11.39 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 121 శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించారని, ఈ ఏరియాలో ఇప్పటి వరకు 522 వారసులకు కారుణ్య నియామకాలు కల్పించామని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఏరియా 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 49.93 లక్షల టన్నులకు గాను 56.78 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 114 శాతం ఉత్పత్తి లక్ష్యం సాదించామని తెలిపారు. ఉత్పత్తి చేసిన బొగ్గును రోడ్డు, రైల్ మార్గాల ద్వారా 13.08 లక్షల టన్నులు రవాణా చేసినట్టు చెప్పారు. ఇలా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 64.56 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు. ఏరియాలో 114 శాతం ఉత్పత్తిని సాధించడం పట్ల కొత్తగూడెం ఏరియాలోని ఉద్యోగులు, అధికారులకు, సూపర్‌వైజర్లకు అభినందనలు తెలిపారు. ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉత్పత్తి సాధించడం గర్వకారణమన్నారు. జేవీఆర్ సీహెచ్‌పీలో అత్యధిక బొగ్గు రవాణాకు సహకరించి పనిచేసిన ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కొత్తగూడెం ఏరియాలో కారుణ్య నియామకాల కింద ఇప్పటి వరకు 522 మంది వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. 58 మందికి ఉద్యోగం బదులుగా ఏక మొత్తంలో బెనిఫిట్స్, ఒకరికి నెలవారి భృతి మంజూరు చేశామన్నారు. రూ.10 లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీని కొత్తగూడెం ఏరియా 373 దరఖాస్తులకు గాను 352 మందికి మంజూరు అందచేశామని, మిగిలిన 21 సరైన పత్రాలు సమర్పిస్తే మంజూరు పత్రాలు అందచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) కె.హానా, సుమలత, పర్సనల్ మేనేజర్ డి.కిరణ్ బాబు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ డి.రమణ రెడ్డి, సింగరేణి సేవా సమితి కో- ఆర్డినేటర్ సాగర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.