రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 126 మంది ఎంపిక

– పాఠశాల విద్య నుంచి 54 మందికి అవకాశం
– గురుపూజోత్సవం సందర్భంగా 5న ప్రదానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2023కు 126 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 54 మంది ఉన్నారు. వారిలో గెజిటెడ్‌ హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు పది మంది, స్కూల్‌ అసిస్టెంట్లు, పీజీటీలు, టీజీటీలు 20 మంది, ఎస్జీటీలు 11 మంది, ఐఏఎస్‌ఈ, సీటీఈ, డైట్‌ కాలేజీల నుంచి ఒకరు, ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయులకు 12 మంది కలిపి మొత్తం 54 మంది ఎంపికయ్యారు. ఈనెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా వారిని సన్మానించడంతోపాటు రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, శాలువా, బంగారుపూత పూసిన రజతపతకం అందజేస్తారు.
రేపు ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి సమావేశం
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు పాఠశాల విద్యాశాఖలో రిపోర్టు చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి మదన్‌మోహన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామనీ, ముఖ్యఅతిధిగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
5న రవీంద్రభారతిలో గురుపూజోత్సవం
తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిధిగా హాజరవుతారని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన తెలిపారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డితోపాటు విశిష్ట అతిధులుగా శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గౌరవ అతిధులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.