కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత…


హైదరాబాద్:
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సీనియర్‌ నటుడు కృష్ణ జి రావు (71) కన్నుమూశాడు. కేజీఎఫ్‌ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి పట్ల కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌లో కృష్ణ జి.రావు కనిపిస్తాడు. ఈ చిత్రంలో అంధుడు పాత్రలో నటించాడు. అంధుడు అయిన కృష్ణను విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తుండగా.. ఆయనను కాపాడడానికి రాఖీ భాయ్ రంగంలోకి దిగుతాడు. ఈయన నిడివి తక్కువే అయినప్పటికీ.. హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ రావడానికి కారణమైన పాత్రలో కనిపించడంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. కేజీఎఫ్‌ సెకండ్‌ పార్ట్‌లో కూడా ఈయన సుల్తాన్‌ పాటలో కనిపిస్తాడు. ఈ సినిమా తర్వాత ఈయనకు కన్నడలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆయన మేయిన్‌ లీడ్‌ లోనూ నానో నారాయణప్ప అనే సినిమా చేశాడు. ప్రస్తుత పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది. కేవలం నటుడిగానే కాకుండా కృష్ణ అసిస్టెంట్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌గా దాదాపు 40సినిమాలకు పైగా పనిచేశాడు. అనేక సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా నటించాడు. అంతేకాకుండా దాదాపు 500 సినిమాలకు సెన్సార్‌ స్క్రిప్ట్‌ రాశాడు.